అండర్‌డాగ్‌గా అడుగుపెట్టిన జట్టు అప్రతీహత విజయాలతో హ్యాట్రిక్ నమోదు చేసుకుంటే.. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో మెగాటోర్నీకి వచ్చిన జట్టు.. మూడో మ్యాచ్‌లోగాని గెలుపు రుచిచూడలేకపోయింది. టీమ్ఇండియాపై నెగ్గిన జోష్‌లో ఉన్న పాకిస్థాన్.. అదే ఊపులో వరుసగా మూడో విజయంతో దాదాపు నాకౌట్ బెర్త్ ఖరారు చేసుకోగా.. చివరి వరకు చక్కటి పోరాట పటిమ కనబర్చిన అఫ్గానిస్థాన్ ఆఖర్లో ఒత్తిడికి చిత్తైంది. పాక్ విజయానికి 12 బంతుల్లో 24 పరుగులు అవసరమైన దశలో ఆసిఫ్ అలీ నాలుగు భారీ సిక్సర్లతో పాక్ నయా హీరోగా అవతరించాడు. మరో మ్యాచ్‌లో హిట్టర్లతో దట్టంగా ఉన్న వెస్టిండీస్.. బంగ్లాదేశ్‌పై ఉత్కంఠ విజయం సాధించింది. రెండు పరాజయాల తర్వాత పోలార్డ్ సేనకు టీ20 ప్రపంచకప్‌లో ఇది తొలి గెలుపు కాగా.. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఓడిన బంగ్లాదేశ్ నాకౌట్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది!
దుబాయ్: ఏమాత్రం అంచనాలు లేకుండా టీ20 ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన పాకిస్థాన్ వరుస విజయాలతో సెమీస్‌కు చేరువైంది. సూపర్-12, గ్రూప్-2లో భాగంగా శుక్రవారం జరిగిన పోరులో పాకిస్థాన్ 5 వికెట్ల తేడాతో అఫ్గానిస్థాన్‌పై గెలుపొందింది. పాక్ విజయానికి 12 బంతుల్లో 24 పరుగులు అవసరమైన దశలో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ ఆసిఫ్ అలీ (7 బంతుల్లో 25 నాటౌట్; 4 సిక్సర్లు) నాలుగు సిక్సర్లు కొట్టి జట్టును విజయతీరాలకు చేర్చాడు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 147 పరుగులు చేసింది. టాపార్డర్ విఫలమైనా.. కెప్టెన్ నబి (35 నాటౌట్), నైబ్ (35 నాటౌట్) రాణించడంతో అఫ్గాన్ ఓ మాదిరి స్కోరు చేసింది. లక్ష్యఛేదనలో పాక్ 19 ఓవర్లలో 5 వికెట్లకు 148 పరుగులు చేసింది. బాబర్ ఆజమ్ (51) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా.. ఫఖర్ జమాన్ (30), ఆసిఫ్ అలీ సత్తాచాటారు. స్పిన్నర్లు సత్తాచాటడంతో ఒకదశలో పాక్ ఛేదన కష్టమనిపించినా.. ఆఖర్లో షోయబ్ మాలిక్ (19), ఆసిఫ్ అలీ భారీ షాట్లతో విరుచుకుపడటంతో మరో ఓవర్ మిగిలుండగానే పాక్ విజయం సాధించింది.
అఫ్గానిస్థాన్: 20 ఓవర్లలో 147 (నబి 35 నాటౌట్, నైబ్ 35 నాటౌట్; ఇమాద్ 2/25),
పాకిస్థాన్: 19 ఓవర్లలో 148/5 (బాబర్ 51, ఫఖర్ 30; రషీద్ 2/25).