Pakistan : ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో హెచ్ఐవీ అంతరించే దశకు చేరుకుంటుంటే పాకిస్తాన్లో మాత్రం విజృంభిస్తోంది. తాజాగా పాకిస్తాన్లోని అతిపెద్ద పట్టణమైన కరాచీలో ఎయిడ్స్ బాధితుల సంఖ్య పెరిగింది. అది కూడా పిల్లలకు హెచ్ఐవీ సోకింది. గత ఏడాది నవంబర్ నుంచి ఇప్పటివరకు 94 మంది పిల్లలకు హెచ్ఐవీ సోకింది. అది కూడా ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో.
ఈ అంశంపై సింధ్ ప్రావిన్స్ హెల్త్ సెక్రెటరీ హుసేన్ సంఘీ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. కరాచీలో కుల్సూమ్ బాయ్ వాలికా అనే ప్రభుత్వ ఆస్పత్రి ఉంది. దీన్ని సింధ్ ఎంప్లాయిస్ సోషల్ సెక్యూరిటీ సంస్థ నిర్వహిస్తోంది. ఈ ప్రభుత్వ ఆస్పత్రిలో గత ఏడాది నవంబర్లో తొలి హెచ్ఐవీ కేసు నమోదైంది. అప్పటినుంచి ఇప్పటివరకు మొత్తం 94 మంది పిల్లలకు హెచ్ఐవీ సోకింది. వీరిలో ఆరుగురు పిల్లలు హెచ్ఐవీ/ఎయిడ్స్ కారణంగా మరణించారు. ఈ నెలలోనే ఇప్పటివరకు 16 హెచ్ఐవీ కేసులు నమోదయ్యాయి. హెచ్ఐవీ విజృంభిస్తుండటంపై వైద్యాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు, పిల్లలకు హెచ్ఐవీ ఎలా సోకుతుంది అనే అంశంపై విచారణ జరుపుతున్నట్లు హుస్సేన్ సంఘీ తెలిపారు.
ఆస్పత్రిలో హెచ్ఐవీ పరీక్షలు ఎక్కువగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లో దాదాపు 10,000 మంది నివసిస్తున్నారు. వీరిలో 120 మంది హెచ్ఐవీ బారినపడ్డారు. వీరిలో పిల్లలు, పెద్దలు ఉన్నారు. హెచ్ఐవీ సోకిన వారికి ప్రభుత్వమే చికిత్స అందిస్తోంది. వీరి చికిత్స కోసం ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. బాధిత పిల్లలకు ప్రత్యేక చికిత్స అందించేందుకు రెండు బిలియన్ల పాక్ రూపాయలతో నిధిని కూడా ఏర్పాటు చేసింది. బాధిత పిల్లలకు ఇప్పటికే ప్రముఖ వైద్య సంస్థల్లో చికిత్స అందిస్తున్నట్లు సంఘి తెలిపారు.