మేడ్చల్, డిసెంబర్16 (నమస్తే తెలంగాణ): వానకాలం వడ్ల కొనుగోళ్లు తుదిదశకు చేరాయి. మేడ్చల్ జిల్లా వాప్తంగా 11 కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటి వరకు 2312 మంది రైతుల నుంచి లక్షా 24 వేల క్వింటాళ్ల వడ్ల కొనుగోలును పూర్తి చేశారు. కొనుగోలు చేసిన వడ్లకు సంబంధించి రూ.24 కోట్ల 36 లక్షలను రైతుల ఖాతాల్లో జమచేశారు. మరో 60 వేల క్వింటాళ్ల వడ్లను రైతుల నుంచి కొనుగోళ్లు చేయాల్సి ఉంది. ఈనెల చివరి వారం వరకు వడ్ల కొనుగోళ్లను అధికారులు పూర్తి చేయనున్నారు. జిల్లాలోని మాదారం, ఎదులాబాద్, ప్రతాపసింగారం, లక్ష్మాపూర్, కేశవరం, ఉద్దమర్రి, కీసర, మేడ్చల్, డబీల్పూర్, శామీర్పేట్, పూడూర్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వడ్ల కొనుగోలు పూర్తి అయిన మాదాపూర్ కొనుగోలు కేంద్రాన్ని మూసివేశారు.
కొనుగోలు చేయాల్సింది
జిల్లా వ్యాప్తంగా వానకాలం వడ్లను కొనుగోలు చేయాల్సింది ఇంకా 60 వేల క్వింటాళ్లు మాత్రమేనని మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్ రాజేందర్ తెలిపారు. వరి కోతలు దాదాపుగా పూర్తయిన నేపథ్యంలో ఈనెల చివరి వారం వరకు 60 వేల క్వింటాళ్ల వడ్ల కొనుగోలు పూర్తి కానున్నదన్నారు. మాదారం కొనుగోలు కేంద్రం పరిధిలో రైతుల నుంచి వడ్ల కొనుగోలు పూర్తయ్యిందని, అక్కడి కేంద్రాన్ని మూసివేసినట్లు వివరించారు.