సిద్దిపేట, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎన్నో ఏండ్లు కష్టపడి సొంతింటి కల సాకారం చేసుకున్న వారి ఆశలు ఆవిరవుతున్నాయి. చెమట చిందించిన సంపాదించిన డబ్బుతో కొనుగోలు చేసిన ప్లాట్లు, నిర్మించుకున్న ఇండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం అకస్మాత్తుగా 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంతోపాటు గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల మున్సిపాలిటీల్లోని దాదాపు 10వేల ఇండ్లు, 8 వేలకుపైగా ప్లాట్లను నిషేధిత జాబితాలో చేర్చడంతో వాటి యజమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తమ సొంత ఆస్తిపై పూర్తి హకులు ఉన్నాయన్న నమ్మకంతో ఇండ్లను నిర్మించుకున్నవారు, ప్లాట్లు కొనుగోలు చేసినవారు ఇప్పుడు వాటిని అవసరానికి అమ్ముకోవాలన్నా, ఇతరుల నుంచి కొనుగోలు చేయాలన్నా తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నట్టు బాధితులు వాపోతున్నారు.
జాబితాలో చేర్చిన పలు సర్వే నంబర్లు
జిల్లా కేంద్రం పరిధిలోని రంగధాంపల్లి, హౌసింగ్ బోర్డు, రెవెన్యూనగర్, ఆయోధ్యనగర్ తదితర ప్రాంతాల్లో 22ఏ జాబితా వ్యవహారం ప్లాట్ల యజమానులను కలవరపెడుతున్నది. సిద్దిపేట అర్బన్ పరిధిలోని 1906/1లో 9 ఎకరాలు నిషేధిత జాబితాలో చేర్చారు. సిద్దిపేట పట్టణంలోని హౌసింగ్‌బోర్డు ఏరియాలో చాలా సర్వే నంబర్లను నిషేధిత జాబితాలో చేర్చారు. ఇవికాకుండా 1833లో 14 ఎకరాలు, 1906/1లో 9 ఎకరాలు, 1165లో 2 ఎకరాల 30 గుంటలను జాబితాలో చేర్చారు. రంగధాంపల్లి పరిధిలోని 845, 860, 932, 966, 971, 985, 1015, 1020, 1025, 1030, 1053, 1054, 1055, 1056, 1057, 1068, 1084, 1085, 967, 968, 983, 1026, 1027, 1029, 1034, 1074, 1075, 1104, 1164, 1166, 835, 836, 837, 838, 839, 1095, 1096, 1097, 1098, 1099, 1100 తదితర సర్వే నంబర్లు జాబితాలో ఉన్నట్టు తెలిసింది.
వేల కుటుంబాలపై తీవ్ర ప్రభావం
ఇండ్లు, ప్లాట్లు నిషేధిత జాబితాలో చేర్చడంతో.. ఇల్లు అమ్మి పిల్లల చదువులు, వివాహాలు, వైద్య అవసరాలు లేదా ఇతర అత్యవసర పరిస్థితులను తీర్చుకోవాలనుకునే వారికి మార్గం లేకుండా పోయింది. కొనుగోలుదారులు ముందుకు రావడానికి వెనుకంజ వేస్తుండటంతో మారెట్లో ఆస్తుల విలువపై ప్రభావం పడుతున్నది. ఒకప్పుడు మంచి డిమాండ్ ఉన్న ప్రాంతాల్లోనూ ప్లాట్లు, ఇండ్లను విక్రయించేందుకు యజమానులు ఇబ్బందిపడాల్సి వస్తున్నది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బాధిత కుటుంబాలు మండిపడుతున్నాయి. భూములపై సమగ్ర పరిశీలన చేయకుండా నిషేధిత జాబితాలో ఎలా చేర్చుతారని సర్కార్‌ను ప్రశ్నిస్తున్నారు. ఏండ్లుగా ప్రజల ఆధీనంలో ఉన్న, రిజిస్ట్రేషన్ ద్వారా కొనుగోలు చేసిన ఆస్తుల విషయంలో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా
సిద్దిపేట జిల్లా కేంద్రంలో 22ఏ నిషేధిత భూముల జాబితాలోని భూములను సవరించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సిద్దిపేట పాత బస్ స్టాండ్ వద్ద గురువారం బాధితులతో కలిసి నిరసన చేపట్టారు. కార్యక్రమంలో సిద్దిపేట ప్రాంతానికి చెందిన పలువురు బాధితులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. అధికారులు పరిశీలించి అర్హత ఉన్న భూములను 22ఏ జాబితా నుంచి తొలగించి రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు.
మూడేండ్ల క్రితమే ఇల్లు కట్టాను
సిద్దిపేట పట్టణ పరిధిలోని పొన్నాల రెవెన్యూలోని అయోధ్యనగర్ మొత్తం నిషేధిత జాబితాలో పెట్టారు. నేను మూడేండ్ల క్రితమే భూమి కొని ఇల్లు కట్టుకున్నాను. మా కాలనీ మొత్తం 22ఏ నిషేధిత జాబితాలో పెట్టారు. ఇది ఎంతవరకు సమంజసం. ప్రభుత్వం నిషేధిత జాబితా నుంచి మా కాలనీని తొలగించాలి.
-పింజరి అశోక్, అయోధ్యనగర్, సిద్దిపేట
10 ఏండ్లుగా ఇకడే నివసిస్తున్నాం
అయోధ్యనగర్‌లో దాదాపు 60 ఇండ్లు ఉన్నాయి. పదేండ్ల క్రితమే ఇకడ 200 గజాల ప్లాట్ కొనుగోలు చేసి ఇల్లు కట్టుకున్నాం. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మా కాలనీని నిషేధిత జాబితాలో పెట్టింది. మా గోస ఎవరికి చెప్పుకోవాలి. సర్కార్ వెంటనే మా కాలనీని నిషేధిత జాబితా నుంచి తొలగించాలి.
-రామకృష్ణ, అయోధ్యనగర్, సిద్దిపేట