హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ వార్షిక పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయంలో డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ ఫలితాలు విడుదల చేశారు. పదో తరగతిలో 72%, ఇంటర్లో 68.70% ఉత్తీర్ణత నమోదయ్యింది. ఏప్రిల్ 20 నుంచి 27 వరకు పరీక్షలు నిర్వహించగా, ఫలితాలను శనివారం వెల్లడించారు. మీ సేవ, ఆన్లైన్లోను అడ్మిషన్లు పొందే అవకాశం కల్పించామని, అడ్మిషన్లకు కావాల్సిన డాక్యుమెంట్లు కూడా తగ్గించామని పేర్కొన్నారు.
పాస్ మెమోలను మీసేవ ద్వారా పొందే వెసులుబాటు కల్పిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ పీవీ శ్రీహరి, జాయింట్ డైరెక్టర్ ఎం సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పదో తరగతిలో 36,863 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే.. 26,542 మంది పాసయ్యారు. ఇంటర్మీడియట్లో 54,679 మందికి 37,562 మంది పాసైనట్టు అధికారులు తెలిపారు.
