New Delhi : దేశరాజధాని ఢిల్లీలో ఆక్సిజన్ సిలిండర్ పేలిన ఘటనలో ఒకరు మరణించగా, మరో నలుగురు గాయపడ్డారు. ఈ ఘటన ఢిల్లీ, ఓఖ్లా ఫేజ్-1లో బుధవారం ఉదయం జరిగింది. ఒక కమ్యూనిటీ హాల్లో ఉన్న ఆక్సిజన్ సిలిండర్ ఉదయం 11.30 గంటల సమయంలో పేలిపోయింది. ఈ ఘటనలో అక్కడే ఉన్న ఒక వ్యక్తి మరణించగా, మరో నలుగురు గాయపడ్డారు. దీని గురించి 11.55 గంటలకు పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందింది. వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.
అంబులెన్సులు, ఫైర్ ఇంజిన్లు చేరుకున్నాయి. ఘటనలో గాయపడిన వారిని వెంటనే అంబులెన్సుల్లో స్థానిక ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. మరో వ్యక్తి ఘటనా స్థలంలోనే మరణించగా.. అతడి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సిలిండర్ పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఢిల్లీలో ఇటీవలే సత్యనికేతన్ పీజీ హాస్టల్ భవనం కూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటివరకు ఏడుగురు మరణించారు. ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
ఈ బిల్డింగ్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఈ బిల్డింగ్ యజమాని హరిరాం , ఆయన భార్య ఊర్మిళ, తనయుడు మహేష్ బన్సల్‌ను పోలీసులు అరెస్టు చేయగా.. వారు ఈ బిల్డింగ్‌ను శుభం త్యాగి, శుభాన్షులకు లీజుకు ఇచ్చినట్లు చెప్పారు. దీంతో వీరిలో శుభాన్షును పోలీసులు అరెస్టు చేశారు. శుభం కోసం గాలిస్తున్నారు. వీరు హాస్టల్ డేజ్ పేరుతో ఈ పీజీని నిర్వహిస్తున్నట్లు పోలీసులు తేల్చారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు, ఢిల్లీ మున్సిపల్ అధికారులు సిద్ధమవుతున్నారు.