Statue of Equality | మరికాసేపట్లో ముచ్చింతల్లో సమతామూర్తి సహస్రాబ్ది వేడుకలకు అంకురార్పణ జరగనుంది. ఈ నేపథ్యంలో సమతామూర్తి విగ్రహం ఎదుట తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రదర్శన చేపట్టారు. 2,500 మంది కళాకారులతో ప్రదర్శన నిర్వహించారు. మహిళలు బోనమెత్తి, కోలాటం ఆడారు. వందలాది మంది కళాకారులు ఒగ్గుడోలుతో నిర్వహించిన ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా చిన్నారులు వస్త్రాలు ధరించి వేడుకలకు హాజరయ్యారు.
ఈ వేడుకల్లో భాగంగా సమతామూర్తి విగ్రహంతో తపాలాశాఖ ముద్రించిన పోస్టల్ కవర్ను చినజీయర్ స్వామి, మైం హోమ్ అధినేత రామేశ్వర్ రావు కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పోస్టల్ శాఖ అధికారులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకల్లో భాగంగా యాగశాలలో వాస్తు శాంతి పూజ బుధవారం మధ్యాహ్నం ముగిసింది. సాయంత్రం 5 గంటలకు సమతామూర్తి సహస్రాబ్ది వేడుకలకు అంకురార్పణ జరగనుంది. చినజీయర్ స్వామి యాగశాలలో ఈ వేడులకు అంకురార్పణ చేయనున్నారు. ఈ వేడుకల అంకురార్పణకు సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు.