Artificial Sun | సియోల్, ఏప్రిల్ 2: కేంద్రక సంలీన ప్రక్రియ(న్యూక్లియర్ ఫ్యుజన్)లో తమ కృత్రిమ సూర్యుడు కొత్త రికార్డు సృష్టించినట్టు దక్షిణ కొరియాకు చెందిన శాస్త్రవేత్తలు వెల్లడించారు. కొరియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యుజన్ ఎనర్జీలోని కేస్టార్(దీనినే కృత్రిమ సూర్యుడు అని పిలుస్తారు)లో అణు సంలీయ ప్రక్రియ ద్వారా 48 సెకన్ల పాటు 100 మిలియన్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేసినట్టు ప్రకటించారు.
ఇది సూర్యుడి మధ్యభాగంలో ఉండే ఉష్ణోగ్రత కంటే దాదాపు ఏడు రెట్లు ఎక్కువ. ఇంతకుముందు 2021లో 30 సెకన్ల పాటు ఈ ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేయగా ఆ రికార్డును ఇప్పుడు అధిగమించినట్టు చెప్పారు. 2026 నాటికి 300 సెకన్ల పాటు 100 మిలియన్ డిగ్రీల ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు.