ముంబై : మిస్ యూనివర్స్ సుష్మితా సేన్‌తో డేటింగ్ చేస్తున్నట్లు లలిత్ మోడీ తెలిపాడు. సుష్మితాతో దిగిన ఫోటోలను తన ట్విట్టర్లో షేర్ చేసి అందర్నీ షాక్‌కు గురిచేసిన లలిత్ మరో ట్వీట్లో తమ రిలేషన్‌పై మరింత క్లారిటీ ఇచ్చాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు తొలి చైర్మెన్‌గా చేసిన లలిత్ మోదీ ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్న విషయం తెలిసిందే. గురువారం రోజున తన ట్విట్టర్లో లలిత్ మోదీ కొన్ని ఫోటోలను పోస్టు చేశాడు. సుష్మితా సేన్‌తో ఇంటిమేట్‌గా దిగిన ఆ ఫోటోలను పోస్టు చేసి తన జీవితం కొత్తగా మొదలైనట్లు పేర్కొన్నాడు. సుష్మితా తన బెటర్ హాఫ్ అన్న లలిత్.. తన పోస్టుతో ఆ బ్యూటీ అభిమానుల గుండెల్లో బాంబు పేల్చేశాడు. ప్రపంచ టూర్ చేశామని, మాల్దీవులు, సర్దినియా వెళ్లి వచ్చామని చెప్పిన లలిత్ మోదీ.. చుక్కల్లో తేలిపోతున్నట్లు వెల్లడించాడు. ఇక మరో ట్వీట్లో పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చాడు. తాము ఇంకా పెళ్లి చేసుకోలేదని, కేవలం డేటింగ్ చేస్తున్నామని తెలిపాడు. కానీ ఏదో ఒక రోజు తాము పెళ్లి చేసుకున్నా ఆశ్చర్యంలేదన్న సంకేతాన్ని కూడా లలిత్ మోడీ తన ట్వీట్లో వ్యక్తపరిచాడు.
ఐపీఎల్లో మనీల్యాండరింగ్, పన్ను ఎగవేత ఆరోపణలు ఎదుర్కొన్న లలిత్ మోడీ.. 2010లో ఇండియా నుంచి పరారీ అయ్యాడు. అయితే అప్పటి నుంచి అతను లండన్‌లోనే ఉంటున్నాడు. 46 ఏళ్ల సుష్మితా సేన్ ఇటీవల ఇటలీ, మాల్దీవులకు వెళ్లిన ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది. 1994లో ఆమె మిస్ యూనివర్స్ టైటిల్ నెగ్గిన విషయం తెలిసిందే. దస్తక్, బీవీ నెంబర్ 1, డు నాట్ డిస్టర్బ్, మై హూ నా, మైనే ప్యార్ క్యూ కియా, తుమ్ కో నా బూల్ పాయింగే, నో ప్రాబ్లమ్ లాంటి చిత్రాల్లో ఆమె నటించింది. ఇటీవల మోడల్ రోహ్మన్ షాల్‌తో డేటింగ్ చేసిన సుష్మితా గత ఏడాది డిసెంబర్లో అతనితో బ్రేకప్ అయ్యింది. సుష్మితాకు ఇద్దరు పిల్లలు. ఆ ఇద్దర్నీ ఆమె దత్తత తీసుకున్నది.
Just for clarity. Not married – just dating each other. That too it will happen one day. 🙏🏾🙏🏾🙏🏾🙏🏾 pic.twitter.com/Rx6ze6lrhE
— Lalit Kumar Modi (@LalitKModi) July 14, 2022