సిటీబ్యూరో, నవంబర్ 10(నమస్తే తెలంగాణ): అమెరికాలో పుట్టి.. పెరిగానని చెప్పుకుంటూ..విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నట్లు షో చేస్తూ ఇన్స్టాగ్రామ్.. ఫేస్బుక్ వేదికగా అమ్మాయిలను, వివాహితులతో పరిచయం చేసుకొని ఆ తరువాత వారిని లొంగదీసుకొని బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్న ఘరానా మోసగాడిని నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ(ఓఎస్డీ) రాధాకిషన్‌రావు కథనం ప్రకారం.. ఈస్ట్‌గోదావరి జిల్లా తుని ముండలం హంసవరం గ్రామానికి చెందిన షేక్ మహ్మద్ రఫీ అలియాస్ కార్తీక్ వర్మ 2010లో జీవనోపాధి కోసం నగరానికి వచ్చి పలు హోటళ్లలో పనిచేశాడు. 2017లో అస్మాభాను అనే యువతితో పెండ్లి చేసుకొని బిడ్డకు జన్మనిచ్చాడు. ఆ తరువాత భార్యను వరకట్నం కోసం వేధించడంతో నెల్లూరు జిల్లాలోని గూడురు కటో టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
బెంజ్‌కారులో వచ్చేస్తాడు..
గచ్చిబౌలి ప్రాంతంలోని డైమండ్ మంజీరా గేటెట్ కమ్యూనిటీలో ఇంటిని అద్దెకు తీసుకున్న కార్తీక్ వర్మ.. తన గెటప్ మొత్తం మార్చేశాడు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కార్తీక్‌వర్మ 196 పేరుతో ఐడీని తయారు చేశాడు. తాను ఆమెరికాలో పుట్టానని..చిన్నతనంలో భారతదేశానికి వచ్చానని.. తన తల్లి సింగపూర్‌లో డాక్టర్‌గా పనిచేస్తుందని ఇలా రకరకాలుగా సోషల్‌మీడియాలో పరిచయం అయిన యువతులు, మహిళలతో చెప్పుకునేవాడు. కొన్నాళ్లు స్నేహం చేసిన తరువాత కలుద్దామని ప్రతిపాదించేవాడు. కలిసేందుకు ఫైవ్ స్టార్ హోటళ్లను ఎంచుకునేవాడు. బెంజ్‌కారులో వెళ్లి తాను భారీ ధనవంతుడినని బిల్డప్ ఇచ్చేవాడు. ప్రేమ పేరుతో దగ్గరై, సహజీవనం చేసేవాడు. ఆ సమయంలో వీడియోలు తీసుకునేవాడు. డబ్బులు అవసరమున్నాయని తీసుకొని మోసం చేసేవాడు. ఎప్పుడైతే ఇచ్చిన డబ్బులు, బంగారు ఆభరణాలు తిరిగి ఇవ్వాలంటూ బాధితులు అడిగితే .. తన వద్ద వీడియోలున్నాయని బ్లాక్‌మెయిల్‌కు పాల్పడేవాడు. ఓ మహిళ ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్‌లో తనకు జరిగిన మోసంపై ఫిర్యాదు చేయడంతో ఇతగాడీ లీలలు వెలుగులోకి వచ్చాయి. నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావు బృందంలోని సిబ్బంది బుధవారం నిందితుడిని పట్టుకున్నారు. కాగా, కార్తీక్‌కు బట్టతల ఉండటంతో కనిపించకుండా విగ్ వాడుతున్నాడు. ఈ విగ్ కోసం నెలకు లక్షల రూపాయలు నిఖర్చు పెడుతున్నట్లు విచారణలో తేలింది.