Siddaramaiah : కర్ణాటక (Karnataka) లో సీఎం మార్పుపై సందిగ్ధత ఇంకా కొనసాగుతూనే ఉంది. త్వరలో కర్ణాటకలో సీఎం మార్పు ఉంటుందని, డీకే శివకుమార్ (DK Shivkumar) సీఎం అవుతారని డీకే వర్గం ప్రచారం చేస్తుండగా.. సీఎం మార్పు జరిగే అవకాశం లేదని, పూర్తిగా ఐదేళ్లు తానే సీఎంగా కొనసాగుతానని సిద్ధరామయ్య (Siddaramaiah) సంకేతాలు ఇస్తున్నారు. ఈ విషయంపై ఆయన తాజాగా మరోసారి స్పందించారు. అసెంబ్లీలో మాట్లాడుతూ.. సీఎం పదవి షేరింగ్‌కు సంబంధించి నాడు (అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత) ఎలాంటి ఒప్పందం జరగలేదని చెప్పారు.
‘నేను ఇప్పటికే ఒకసారి ఐదేళ్లు సీఎం పనిచేశాను. ఆ తర్వాత మళ్లీ ముఖ్యమంత్రిని అయ్యాను. నాకు తెలిసినంతవరకు పార్టీ అధిష్ఠానం నాకే అనుకూలంగా ఉంది. సీఎం పదవిని ఇద్దరు వ్యక్తులు 2.5 ఏళ్ల చొప్పున పంచుకోవాలనే ఒప్పందమేదీ జరగలేదు’ అని సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో ప్రతిపక్షాల కామెంట్స్‌కు స్పందనగా.. ఐదేళ్లు తానే సీఎంగా కొనసాగుతానని సిద్ధరామయ్య చెప్పడం గత నాలుగు రోజుల్లో ఇది రెండోసారి.
గత మంగళవారం కూడా ఆయన అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేల కామెంట్స్‌కు స్పందిస్తూ.. ‘ఇప్పుడు మళ్లీ చెబుతున్నా. ప్రస్తుతం నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఇక ముందు కూడా నేను ముఖ్యమంత్రిగా ఉంటా’ అని వ్యాఖ్యానించారు. కాగా సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్ మధ్య వివాదం చాలారోజులుగా కొనసాగుతోంది. ఈ విషయం హైకమాండ్ సైతం జోక్యం చేసుకుని సయోధ్య కుదిర్చింది. అయినా ప్రయోజనం లేదు. సీఎం మార్పు ఉంటుందని ప్రచారం జరుగుతూనే ఉంది.