Nidhhi Agerwal | నిధి అగర్వాల్… గత కొన్ని రోజులుగా టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారిన పేరు. ఇటీవల హైదరాబాద్‌లోని లూలు మాల్లో ‘రాజాసాబ్’ సినిమా సాంగ్ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమెకు ఎదురైన చేదు అనుభవం ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది. ప్రమోషన్ ఈవెంట్‌కు భారీగా తరలివచ్చిన అభిమానులు నిధి దగ్గరకు చేరుకునేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి అదుపు తప్పింది. కొందరు హద్దులు దాటి ప్రవర్తించడంతో నిధి తీవ్ర అసౌకర్యానికి గురైనట్లు సమాచారం. ఈ ఘటన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మహిళల భద్రతపై మరోసారి ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.
పరిస్థితి తీవ్రతను గమనించిన బాడీగార్డులు వెంటనే రంగంలోకి దిగడంతో నిధిని అక్కడి నుంచి సురక్షితంగా బయటకు తీసుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో నిధి అగర్వాల్‌కు సంబంధించిన పాత వీడియోలు, ఇంటర్వ్యూల్లో చేసిన వ్యాఖ్యలు నెట్టింట మళ్లీ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆమె గతంలో కాస్టింగ్ కౌచ్ అంశంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.ఓ ఇంటర్వ్యూలో నిధి మాట్లాడుతూ, సినిమా పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ అనేది “రాక్షసి లాంటిదని” పేర్కొన్నప్పటికీ, అది తనకు వ్యక్తిగతంగా ఎదురుకాలేదని చెప్పింది. అలాంటి పరిస్థితి వస్తే చాలా బాధగా అనిపిస్తుందని ఆమె స్పష్టం చేసింది.
ఇప్పుడు లూలు మాల్ ఘటన తర్వాత ఆమె అప్పటి వ్యాఖ్యలు మరోసారి వెలుగులోకి రావడంతో, అభిమానులు మరియు నెటిజన్లు నిధికి మద్దతుగా నిలుస్తున్నారు. ప్రస్తుతం నిధి అగర్వాల్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రం ‘రాజాసాబ్’లో కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగానే ఆమె లూలు మాల్ ఈవెంట్‌కు హాజరైన విషయం తెలిసిందే. తాజా ఘటన నేపథ్యంలో సెలబ్రిటీ ఈవెంట్లలో భద్రత మరింత కట్టుదిట్టం చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. మహిళా నటులు ఎదుర్కొనే ఇబ్బందులపై సమాజం మరింత సున్నితంగా స్పందించాల్సిన అవసరం ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.