భీమ్‌గల్, అక్టోబర్ 6 : నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ పోలీస్‌స్టేషన్‌లో ఆత్మహత్యకు యత్నించిన పొలాస సుధాకర్ (57) చికిత్స పొందుతూ మంగళవారం దవాఖానలో తుదిశ్వాస విడిచాడు. భీమ్‌గల్‌లోని దేవాంగగల్లీకి చెందిన పొలాస సుధాకర్ బస్‌స్టాండ్‌లో చాయ్ హోటల్ నిర్వహిస్తూ, అందులోనే సిగరెట్లు, పాన్ మసాలాలు అమ్ముకుని జీవనం సాగించేవాడు. అతడిపై ఇటీవల పోలీసులు పెట్టీ కేసులు నమోదు చేశారు. జరిమానా చెల్లించేందుకు సోమవారం ఠాణాకు వెళ్లగా కోర్టుకు వెళ్లాలని పోలీసులు సూచించడంతో మనస్తాపం చెందిన సుధాకర్ పెట్రోల్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. గాయపడ్డ సుధాకర్‌ను నిజామాబాద్‌లోని దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. పోలీసుల తీరును నిరసిస్తూ మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితోపాటు అఖిలపక్షాలు ఇచ్చిన పిలుపుమేరకు భీమ్‌గల్‌లో వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు.
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని సుమంగళి చౌరస్తాలో బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు, పట్టణ ప్రముఖులు, దేవాంగ కులసభ్యులు, కుటుంబసభ్యులు బైఠాయించారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పట్టణంలో భారీగా పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్, బీజేపీ ఇతర పార్టీల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారి షాప్, ఇంటి వద్ద భద్రత ఏర్పాటు చేశారు. మానాల గ్రామంలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి భీమ్‌గల్ మీదుగా వెళ్తుండగా అఖిలపక్ష నేతలు అడ్డుకున్నారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని పట్టుబట్టారు. పోలీసులు వచ్చి ఆందోళనకారులను పక్కకు జరిపి ఎమ్మెల్యే వాహనాన్ని పంపించేశారు. పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డితో మాట్లాడి బాధితులకు ఎక్స్‌గ్రేషియాతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగం ఇప్పించడానికి కాంగ్రెస్ నేతలు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం భీమ్‌గల్‌లో అంత్యక్రియలు నిర్వహించగా పట్టణ ప్రజలు భారీగా పాల్గొన్నారు.

చాయ్‌వాలా పొలాస సుధాకర్ (57)ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. సుధాకర్ మరణించిన విషయం తెలిసి, అంత్యక్రియలో పాల్గొనేందుకు బయలుదేరిన ఆయనను హైదరాబాద్‌లోని తన నివాసంలోనే పోలీసులు అడ్డుకుని గృహనిర్బంధం చేశారు. ఈ సందర్భంగా వేముల పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. సుధాకర్ మృతదేహాన్ని చూడకుండా తనను హైదరాబాద్‌లోనే హౌస్ అరెస్ట్ చేయడం పిరికిపందల చర్య అని, ఇది ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని మండిపడ్డారు. భీమ్‌గల్‌లో చాయ్ అమ్ముతూ జీవనం సాగిస్తున్న బీసీ బిడ్డ సుధాకర్ పోలీసుల వేధింపులు తాళలేక పోలీసుస్టేషన్ ఆవరణలోనే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని, చికిత్స పొందుతూ మృతి చెందడం అత్యంత విషాదకరమని ఆవేదన వ్యక్తంచేశారు.
చావు బతుకుల మధ్య ఉన్న వ్యక్తి చేసిన ఆక్రందనలు, ఆరోపణలను పట్టించుకోకుండా అవినీతిపరుడైన ఎస్సై తిరుపతిని సీపీ వెనుకేసుకొస్తున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. సుధాకర్ కుటుంబానికి ప్రభుత్వం రూ.25 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, ఎస్సైపై హత్యాయత్నం కేసు నమోదు చేసి ఉద్యోగం నుంచి తొలగించాలని, మృతుడి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి తక్షణ ఆర్థిక, న్యాయ సహాయం కల్పించాలని కోరారు. సుధాకర్ కుటుంబానికి న్యాయం జరిగేవరకూ ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం కొనసాగిస్తానని స్పష్టంచేశారు. ఈ విషయమై త్వరలోనే మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు.