హైదరాబాద్, జూన్ 27(నమస్తే తెలంగాణ): ‘బెల్ట్ షాపులు నడుపుకోండి. మేం కన్నెత్తి చూడం. ఎమ్మార్పీ ఉల్లంఘన చేసుకోండి. మేం అసలు పట్టించుకోం. నకిలీ మద్యం తెచ్చుకోండి. మేం తెలియనట్టు నటిస్తాం. మూమూళ్లు మాత్రం నెల నెల ఠంచన్‌గా ముట్టాల్రోయ్..’ ఇదీ ఎక్సైజ్ శాఖ అధికారుల తీరు. ప్రతి పనికో రేటు.. ఏ-4 లైసెన్స్ దక్కినప్పుడు ‘గుడ్‌విల్’.. పర్మిట్ రూంలో కూర్చోబెట్టి తాగనిచ్చినందుకు ‘బెనిఫిట్’.. ఎక్సైజ్ క్రైమ్ అంటే ఎమ్మార్పీ ఉల్లంఘన, బెల్టు దుకాణల విక్రయం, దుకాణం వెనుక నుంచి షట్టర్ అమ్మకాలను అనుమతించినందుకు ‘సదర్’.. ఇవి ఏడాదికి రెండుసార్లు ఏకమొత్తంలో ముట్టే రొక్కం. ఇది కాకుండా నెల మామూళ్లు అదనం. మొన్న నిజామాబాద్ ఏసీబీ రైడ్స్ అనంతరం ఒక ఎక్సైజ్ సీఐ రాసుకున్న మూమూళ్ల డైరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే.. నేడు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారుల అవినీతి చిట్టా ‘నమస్తే తెలంగాణ’ చేతికి చిక్కింది.
కానిస్టేబుళ్ల కోసం ఎక్సైజ్ శాఖ 8 ఎఫ్ అనే కఠిన నిబంధన అమల్లోకి తెచ్చింది. ఒకేచోట ఎక్కువ కాలం పనిచేసిన కానిస్టేబుళ్లు అవినీతికి పాల్పడుతున్నారనేది సర్కార్ అభియోగం. నిజానికి, కానిస్టేబుళ్లకు కనీసం పంచనామా అధికారం కూడా లేదు. ఎస్‌హెచ్‌వోలు కూర్చో అంటే కూర్చోవాలి. పరుగెత్తు అంటే పరుగెత్తాలి. ఇదే వాళ్ల డ్యూటీ. కానీ, అధికారులు మహా ఉద్ధండులు. ఒక్కసారి పోస్టింగ్ దక్కితే చాలు సీసాల నుంచి పైసలు పిండుతున్నారు. ఏటా రూ.300 కోట్లకుపైగా మద్యం, కల్లు వ్యాపారుల నుంచి మామూళ్లు వసూలు చేస్తున్నట్టు అంచనా. మద్యం దుకాణాల లైసెన్సుదారుల నుంచి నెలవారీ ముడుపులు తీసుకోవడం, వాళ్ల అక్రమాలు, ఉల్లంఘనలను అడ్డుకోకుండా సహకరించడం.. ఇది ఎక్సైజ్ శాఖలో వ్యవస్థీకృతంగా సాగుతున్న అవినీతి దందా. ఎక్సైజ్ శాఖ అధికారులు, మద్యం వ్యాపారుల కుమ్మకు వెనుక ఉన్నది ‘ముడుపుల బంధమే’ అని తాజాగా తేటతెల్లమవుతున్నది.
వసూళ్ల బాధ్యత స్థానిక ఎస్హెచ్వోదేనట. అయితే నేరుగా దుకాణాల వద్దకు అధికారులు వెళ్లరట. లంచాలు వసూలు చేసేందుకు ప్రత్యేకంగా ఒక వ్యక్తిని పెట్టుకుంటారని చెప్తున్నారు. నెలనెలా అధికారుల తరుఫు వ్యక్తులు వస్తారని, గుట్టుచప్పుడు కాకుండా వీళ్లకు ముడుపుల సొమ్ము అందజేస్తామని దుకాణదారులు చె.జ్ స్టేషన్‌కు సంబంధించిన వివరాలు ‘నమస్తే తెలంగాణ’కు లభించాయి. చిట్టా పద్దు కాగితం వెనుక నుంచి ఎక్సైజ్ శాఖకు సంబంధించిన స్టాంపు కూడా రివర్స్‌లో కనిపిస్తున్నది. 2025లో మద్యం దుకాణాలు కేటాయించిన తరువాత ఒక్కొక్క దుకాణం ఎక్సైజ్ అధికారులు వసూలు చేసిన గుడ్‌విల్, ఇందులో ఎవరు ఎంత తీసుకొన్నారనే వివరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇందులో ఒక్కొక్క దుకాణం నుంచి రూ.66 వేల చొప్పున గుడ్‌విల్ వసూలు చేసినట్టు సదరు డైరీలో ఉన్నది. డీసీకి రూ.21 వేలు, ఈఎస్‌కు రూ.40 వేలు, ఏఈఎస్కు రూ.25 వేల చొప్పున ఇచ్చి, ఎస్‌హెచ్‌వో మాత్రం రూ.75 వేలు తీసుకొన్నట్టు ఉన్నది. ఇద్దరు ఎస్ఐలకు న్యాయంగా లెక్క చేసి రూ. 37,500 చొప్పున పంచినట్టు ఉన్నది. మరో చిట్టాలో క్వార్టర్లీ ఆదాయం అని చెప్తున్నారు. ఆ స్టేషన్ పరిధిలో 7 గ్రామాల్లో కలిపి 29 మద్యం దుకాణాలు ఉండగా.. ఆయా దుకాణంలోకి మద్యం విక్రయాలను బట్టి వసూళ్లు చేసినట్టు తెలుస్తున్నది. మొత్తం ఆ స్టేషన్ పరిధి నుంచి నెలకు రూ.81 వేలు వసూలు అవుతున్నట్టు తెలుసున్నది.
రాష్ట్రంలో 2,620 మద్యం దుకాణాలున్నాయి. 1,200 బార్లు, పబ్బులు ఉన్నాయి. సొసైటీల కింద 4,697 కల్లు దుకాణాలు ఉన్నాయి. ఇందులో ప్రతి దుకాణానికి ఒక రేటు చొప్పున ఫిక్స్ చేశారు. ఉత్తర తెలంగాణలో మద్యం దుకాణాలకు ఎంత అవినీతి రాబడో.. కల్లు దుకాణానికి కూడా అంతే ఆదాయం. ఆయా ప్రాంతాల్లో జరిగే వ్యాపారాన్ని బట్టి ఒకో మద్యం దుకాణం నుంచి అధికారులకు నెలకు సగటున రూ.65 వేలు ఇస్తున్నట్టు తెలుస్తున్నది. కల్లు దుకాణానికి దక్షిణ తెలంగాణలో ఆదాయం కొంత తక్కువ.
సగటున ప్రతి దుకాణానికి రూ.12వేలు ఇస్తున్నారని చెప్తున్నారు. ఇలా నెలకు సగటున రూ.25 కోట్ల చొప్పున ఎక్సైజ్ మామూళ్లు వసూలు అవుతున్నట్టు సమాచారం. బార్ షాపుల ద్వారా రూ.240 కోట్లు, కల్లు దుకాణాల ద్వారా సగటున రూ.60 కోట్ల చొప్పున ఏడాదికి రూ. 300 కోట్ల మేర లంచాల సొమ్ము పంచుకొంటున్నట్టు అక్కడక్కడ బటయపడుతున్న అక్రమ చిట్టాల ద్వారా తెలుస్తున్నది.
నిజామాబాద్ జిల్లాలో ఏసీబీ రైడ్స్ జరిగిన అనంతరం ఒక సీఐ స్థాయి అధికారి రాసుకున్న మామూళ్ల డైరీ బయటికి వచ్చింది. కల్లు దుకాణాల నుంచి నెలకు దాదాపు రూ.3 లక్షలు వసూలు చేస్తున్న ఆ సీఐ.. ఎవరినుంచి ఎంత వసూలు చేశారో డైరీలో క్లియర్‌గా రాసుకున్నారు. వారి నుంచి ఇంకా ఎంత ఎకువ వసూలు చేయాలో కూడా అందులో నోట్ చేసుకున్నారు. సీఐ డైరీలో రహస్యంగా దాచుకున్న చిట్టా ఆ శాఖ ఉద్యోగే సోషల్ మీడియాలో పోస్టు చేసినట్టు తెలుస్తున్నది. జిల్లాకు చెందిన ఒక కాంగ్రెస్ నేత అండదండలతోనే సదరు సీఏ వసూళ్లు చేసినట్టు చెప్తున్నారు. కల్లు దుకాణాల నుంచే నెలకు రూ.లక్షలు వసూలు చేసిన ఎక్సైజ్ అధికారులు మద్యం దుకాణాలు, బార్‌షాపుల నుంచి ఏ మేరకు వసూలు చేస్తున్నారో అంచనా వేయొచ్చని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఉత్తర తెలంగాణ జిల్లాలో పర్మిట్ రూమ్‌కు నెలకు రూ.25 వేలు, బెల్ట్‌షాప్‌కు రూ.5 వేల చొప్పున వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బార్ దుకాణాల నుంచి నెలకు రూ.25 వేల నుంచి రూ.40 వేలు వసూలు చేస్తున్నట్టు చెప్తున్నారు. కల్లు దుకాణాలకు నెలకు రూ.20 వేలు వసూలు చేస్తున్నట్టు ఎక్సైజ్ సీఐ చిట్టాగా చెప్తున్న లెక్కలను బట్టి తెలుస్తున్నది. సరిల్ పరిధిలోని ఎస్ఐ, సీఐలు వసూలు చేసిన మామూళ్లలో 40% పైఅధికారులకు, 10% కానిస్టేబుళ్లకు మిగిలిన 50% ఎక్సైజ్ సీఐ, ఎస్ఐలు పంచుకొంటున్నారని చెప్తున్నారు.