Road accident : అభంశుభం తెలియని తొమ్మిదేళ్ల బాలిక పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యానికి బలైంది. విరిగిపోయిన స్కూల్ బస్సు (School Bus) ఫ్లోర్లో నుంచి రోడ్డుపై జారిపడి బాలిక ప్రాణాలు కోల్పోయింది. బాలిక కింద పడగానే బస్సు వెనుక చక్రాలు ఆమెపై నుంచి పోవడంతో విలవిల్లాడింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని ఆగ్రా సిటీ (Agra city) లో ఈ విషాద ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. నైనా అనే 9 ఏళ్ల బాలిక పుణెలోని ఓ పాఠశాలలో 1వ తరగతి చదువుతున్నది. రోజు లాగానే గురువారం ఉదయం కూడా స్కూల్‌కు వెళ్లేందుకు స్కూల్ బస్సు ఎక్కిన నైనా విరిగిన బస్సు ఫ్లోర్లో నుంచి జారిపడింది. తోటి విద్యార్థులు చూసి కేకలు వేయడంతో డ్రైవర్ బస్సు ఆపాడు. వెంటనే బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించిందని వైద్యులు తెలిపారు. ఎట్మాడ్పూర్ పోలిస్‌స్టేషన్ పరిధిలోని బీహారిపురలో ఈ ఘటన చోటుచేసుకుంది.
స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా శిథిలావస్థలో ఉన్న బస్సును విద్యార్థుల రవాణాకు ఉపయోగించడమే బాలిక ప్రాణాలు కోల్పోవడానికి కారణమని స్థానికులు విమర్శిస్తున్నారు. బస్సు ఫ్లోర్ మొత్తం విరిగిపోయి ఉందని, ఫ్లోర్ సరిగా లేక సీట్లు కూడా ఊగుతున్నాయని, అలాంటి బస్సును పిల్లల రవాణా కోసం వినియోగించడం కచ్చితంగా స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యమేనని మండిపడుతున్నారు.