Niharika | మెగా ఫ్యామిలీకి చెందిన కొణిదెల నిహారిక వ్యక్తిగత జీవితం, కెరీర్‌కు సంబంధించిన విషయాలు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటాయి. ముఖ్యంగా ఆమె వివాహ బంధం ముగిసిన తర్వాత నుంచి నిహారికపై మరింత ఫోకస్ పెరిగింది. చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకున్న నిహారిక, మూడు సంవత్సరాలకే విడిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆమె సింగిల్‌గా జీవిస్తూ, తన కెరీర్‌పై పూర్తి దృష్టి పెట్టింది.కొన్ని సంవత్సరాలు నటిగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న నిహారిక, ప్రస్తుతం నిర్మాతగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆమె నిర్మించిన తొలి చిత్రం కమిటీ కుర్రోళ్లు మంచి విజయాన్ని అందుకుని ఆమెకు నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చింది.
ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు ‘రాకాస’ అనే చిత్రంతో ముందుకు వస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ 3న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మీడియాతో మాట్లాడిన నిహారికకు రెండో పెళ్లి గురించి ప్రశ్న ఎదురైంది. దీనిపై స్పందిస్తూ, తాను మళ్లీ పెళ్లి చేసుకునే ఆలోచన లేకపోలేదని, కానీ ప్రస్తుతం మాత్రం ఆ దిశగా ఆలోచించడం లేదని స్పష్టం చేసింది. తన జీవితంలో వచ్చే మార్పులను సమయం నిర్ణయిస్తుందని తెలిపింది. ఇక తన అన్నయ్య వరుణ్ తేజ్, వదిన లావణ్య త్రిపాఠిల ప్రేమ కథ గురించి కూడా ఆసక్తికర విషయాలు వెల్లడించింది. వారి లవ్ స్టోరీ గురించి తాను నాలుగేళ్ల తర్వాతే తెలుసుకున్నానని చెప్పింది. ముందే తనకు తెలిసిందనే వార్తలను ఖండించింది నిహారిక. అన్నయ్యకు ఇండస్ట్రీలో ఎక్కువ మంది స్నేహితులు లేకపోవడంతో ఆ విషయం చాలా కాలం రహస్యంగా ఉందని పేర్కొంది..
వరుణ్ తేజ్ వ్యక్తిత్వంపై మాట్లాడుతూ, అందరూ అతన్ని ఇంట్రోవర్ట్ అనుకుంటారు కానీ అది నిజం కాదు. అలా కనిపిస్తాడు అంతే. నిజానికి అతను చాలా సరదాగా ఉండే వ్యక్తి. కొన్నిసార్లు నన్ను ఆటపట్టిస్తూ ఏడిపిస్తాడు అంటూ నవ్వుతూ చెప్పింది. ఒకసారి వరుణ్ పుట్టినరోజు వేడుకకు లావణ్య రావడంతో, వారి మధ్య ఏదో ప్రత్యేకమైన బంధం ఉందని అర్థమైందని తెలిపింది. సోషల్ మీడియాలో ట్రోల్స్‌పై కూడా నిహారిక ఘాటుగా స్పందించింది. ట్రోలింగ్‌ను కొంతమంది తమ హక్కుగా భావిస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటేనే మార్పు వస్తుందని వ్యాఖ్యానించింది.