62 ఏండ్ల క్రితం ‘లూనా2’ పేరిట రష్యా తొలిసారిగా చంద్రుడిపై ఓ స్పేస్‌క్రాఫ్ట్‌ను విజయవంతంగా ల్యాండ్ చేసింది. మరి సూర్యుడిపై ఇంతవరకూ ఏ స్పేస్‌క్రాఫ్ట్ ల్యాండ్ కాలేదా?.. ఏమిటా ప్రశ్న..? లక్షల డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలతో భగభగ మండే ఆ అగ్నిగోళంపై రాకెట్‌ను దింపడమేంటి? అది సాధ్యపడుతుందా?.. కలలో కూడా ఊహించలేని అత్యంత సాహసోపేతమైన ఈ మిషన్ నిజంగానే సాకారమైంది. రోదసీ చరిత్రలో ఇప్పటివరకూ నిర్వహించని అత్యంత సంక్లిష్టమైన ఈ ప్రయోగం దిగ్విజయవంతమైంది. ఆ మిషనే ‘పార్కర్ సోలార్ ప్రోబ్’
ఏమిటీ ‘పార్కర్ సోలార్ ప్రోబ్’?
సూర్యుడికి అత్యంత దగ్గరగా వెళ్లి అక్కడి వాతావరణ స్వభావం, కణాలు, గాలుల తీవ్రత, కేంద్రక సంలీన ప్రక్రియలు తదితర కీలక సమాచారాన్ని సేకరించడమే లక్ష్యంగా 2018 ఆగస్టు 12న అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) పార్కర్ సోలార్ ప్రోబ్ పేరిట ఓ రాకెట్‌ను ప్రయోగించింది.
మిషన్ అవసరమేంటి?
భూమికి దగ్గరలో ఉన్న ఏకైక నక్షత్రం సూర్యుడు. ఈ నక్షత్రం నుంచి ప్రసరించే వేడే జీవుల మనుగడకు, భూమి మంచుగడ్డలా మారిపోకుండా ఉండేందుకు సాయపడుతున్నది. అయితే, కేంద్రక సంలీన ప్రక్రియ, సూర్యుడి బాహ్య వలయంలో జరిగే మార్పుల కారణంగా వెలువడుతున్న సౌర తుఫానులతో టెలికం, ఉపగ్రహ వ్యవస్థకు నష్టం కలుగుతున్నది. దీంతో సూర్యుడి నుంచి వెలువడుతున్న వేడి ఎక్కడి నుంచి వస్తున్నది? సూర్యుడి బాహ్య వలయ వాతావరణంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? వంటివి తెలుసుకొనేందుకు 2018లో ఈ ప్రయోగం చేపట్టారు. మిషన్ విజయవంతమైనట్టు తాజాగా ప్రకటించారు.
ఈ ప్రయోగం ఎందుకు అంత క్లిష్టమైనది?
గ్రహాలపై రాకెట్లను ల్యాండ్ చేయడం సులభం. కారణం అక్కడ ఉష్ణోగ్రతలు అంత ఎక్కువగా ఉండవు. సూర్యుడి మీద అలా కాదు. సూర్యుడి కేంద్రకం దగ్గర 1.5 కోట్ల డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటే, బాహ్య పొరలో 5,500-10 లక్షల డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది. ఇంతటి భారీ ఉష్ణోగ్రతలను తట్టుకోవడంతో పాటు.. సూర్యుడి గురుత్వాకర్షణ, బలమైన అయస్కాంత క్షేత్రాన్ని తట్టుకొని సమాచారాన్ని సేకరించాలంటే గంటకు 7 లక్షల కిలోమీటర్ల వేగంతో రాకెట్ ప్రయాణించాలి. ఈ చర్యలను పార్కర్ ప్రోబ్ విజయవంతంగా జరిపింది.
సూర్యుడిపై రాకెట్‌ను ఎలా దించారు?
గ్రహాల మాదిరిగా సూర్యుడి ఉపరితలం ఘన స్థితిలో ఉండదు. అదో వాయు గోళం. అక్కడ ల్యాండ్ కావడం అనేది ప్రత్యేకంగా ఉండబోదు. అయితే, సూర్యుడి బయటి వాతావరణ పొరగా పిలిచే కరోనాలోనికి ప్రవేశిస్తే సూర్యుడిపై దిగినట్టుగానే పరిగణిస్తారు. పార్కర్ ప్రోబ్.. గత ఏప్రిల్ 28న సూర్యుడి కరోనాలోనికి ప్రవేశించింది. అక్కడి వాతావరణ సమాచారాన్ని సేకరించి నాసాకు పంపించింది. వాటిని ఏడెనిమిది నెలలపాటు విశ్లేషించిన పరిశోధకులు.. ప్రోబ్ సూర్యుడి మీద దిగినట్టు ప్రకటించారు.
స్పేస్‌క్రాఫ్ట్‌కు ఏమీ కాలేదా?
సూర్యుడి నుంచి వెలువడే అత్యంత భారీ ఉష్ణోగ్రతలను తట్టుకోవడానికి పార్కర్ ప్రోబ్‌పై 4.5 అంగుళాల మందంతో కార్బన్ కాంపోజిట్ కవచాన్ని ఏర్పాటు చేశారు. ఉష్ణోగ్రతలు లోనికి ప్రవేశించకుండా టంగ్స్టన్, నిబోడియం, మాలిబ్డినం వంటి అత్యధిక ద్రవీభవన స్థానాలు కలిగిన లోహాలను వాడారు. దీంతో బయట లక్షల డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ, మిషన్ లోపల ఉన్న కీలకమైన సమాచార సేకరణ డివైజ్‌ల వద్ద గది ఉష్ణోగ్రతలు మాత్రమే ఉంటాయి.
మిషన్ పేరు: పార్కర్ సోలార్ ప్రోబ్
ప్రయోగించిన సంస్థ: నాసా
ఉద్దేశం: సూర్యుడి కరోనాను విశ్లేషించడం
ప్రాజెక్టు వ్యయం: రూ. 11,462 కోట్లు
ప్రస్తుతం ప్రోబ్ ఉన్న ప్రాంతం: సూర్యుడి కేంద్రకానికి 1.3 కోట్ల కిలోమీటర్ల దూరంలో
2025లో ప్రోబ్ ఉండబోయే చోటు: సూర్యుడి కేంద్రకానికి 69 లక్షల కిలోమీటర్ల దూరం