Secret Soldier | తెలుగు సినీ పరిశ్రమలో విభిన్న కథాంశాలతో వస్తున్న చిత్రాలకు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడుతుంటారు. తాజాగా అలాంటి ఒక వినూత్న ప్రయత్నంతోనే వస్తున్న సరికొత్త స్పై డ్రామా ‘సీక్రెట్ సోల్జర్’. నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. మూన్ లైట్ డ్రీమ్స్ పతాకంపై అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ఇండస్ట్రీలో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. యూనిక్ కాన్సెప్ట్, అదిరిపోయే యాక్షన్ సీక్వెన్సులు, హై-వోల్టేజ్ థ్రిల్స్ మరియు ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో కట్ చేసిన టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా గ్రాండ్‌గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించింది. సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లాంచ్ వేడుక అత్యంత ఉత్సాహంగా సాగింది.
ఈ ప్రత్యేక వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ.. చిత్ర యూనిట్ పడిన కష్టాన్ని కొనియాడారు. సూర్య శ్రీనివాస్ తనకు ‘హిట్ 3’ సినిమా షూటింగ్ సమయంలో ఈ ప్రాజెక్ట్ గురించి తరచూ చెబుతుండేవారని గుర్తుచేసుకున్నారు. ట్రైలర్ చూసిన వెంటనే సినిమాటోగ్రఫీ, మేకింగ్ పరంగా టీమ్ ఎంత కష్టపడిందో స్పష్టంగా అర్థమైందని, ఇదే క్వాలిటీ మరియు ఇంటెన్సిటీ పూర్తి సినిమాలో ఉంటే తెలుగు ప్రేక్షకులు ఖచ్చితంగా ఈ సినిమాను ఆదరించి సపోర్ట్ చేస్తారని ఆయన నూతనం వ్యక్తం చేశారు. కంటెంట్ బలంగా ఉంటే చిన్న, పెద్ద సినిమాలతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని, నిహాల్ నటనలో కనిపించిన ఇంటెన్సిటీ చాలా బాగుందని ప్రశంసించారు. డైరెక్టర్ అక్కి విశ్వనాథ్ రెడ్డికి, టీమ్‌కు ఆయన తన శుభాకాంక్షలు తెలిపారు.
మరో ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ రైటర్, డైరెక్టర్ బీవీఎస్ రవి మాట్లాడుతూ.. ‘సీక్రెట్ సోల్జర్’ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉందని, సెన్సార్ సభ్యుల నుంచి అన్ని క్లియరెన్స్‌లు రావడానికి సుమారు 8 నెలల సమయం పట్టిందంటేనే ఈ చిత్రంలోని కంటెంట్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. నిర్మాత తన దగ్గర ఉన్న ప్రతీ రూపాయిని ఈ సినిమాపై నమ్మకంతో ఖర్చు చేశారని, ఆయనలోని సినిమా మీద ఉన్న ప్యాషన్ అందరికీ స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. కాలభైరవ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని, బలమైన సాంకేతిక నిపుణుల బృందంతో వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి నిర్మాతకు మంచి లాభాలను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో హీరో నిహాల్ కోదాటి మాట్లాడుతూ తనదైన శైలిలో అందరినీ ఆకట్టుకున్నారు. తమ ప్రాజెక్ట్‌ను మొదటి నుంచి సపోర్ట్ చేస్తున్న శాన్వికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బీవీఎస్ రవి, శైలేష్ కొలను లాంటి ప్రముఖులు ఈ వేడుకకు విచ్చేసి తమను అభినందించడం ఎంతో ఆనందాన్నిచ్చిందని చెప్పారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారీ పార్టీ ఇస్తానని సరదాగా నవ్వుతూ చెప్పారు. ఒకవేళ సినిమా రిజల్ట్ తేడా కొడితే పంజాగుట్ట సెంటర్లో ఆటో ఎక్కి ఇంటికి వెళ్లి రెండు రోజులు ఏడ్చి, వెంటనే మరో కొత్త సినిమా పనుల్లో బిజీ అయిపోతానని చమత్కరించారు. ఈ సినిమాను చాలా మంది చిన్న సినిమా అనుకుంటున్నారని, కానీ కేంద్ర హోంశ్రాత్వ శాఖ నుంచి ఈ ఏడాది పరిశీలనకు వెళ్లిన చిత్రాల్లో ‘దురంధర్’, సల్మాన్ ఖాన్ సినిమాతో పాటు మూడోది తమ ‘సీక్రెట్ సోల్జర్’ కావడం విశేషమని గుర్తుచేశారు. ఈ చిత్రంలోని ఐడియా, విజువల్స్ ప్రేక్షకులను అబ్బురపరుస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
నటుడు కమల్ కామరాజు మాట్లాడుతూ.. దర్శకుడు తనకు ఈ కథ చెప్పినప్పుడు ఒక సరికొత్త అనుభూతి కలిగిందని, తెలుగు తెరపై ఇంత పెద్ద స్కేల్లో స్పై జానర్ మూవీ రావడం చాలా సంతోషకరమైన విషయమని అన్నారు. ఇలాంటి విభిన్నమైన చిత్రాలు విజయం సాధిస్తేనే మరికొ కొత్త దర్శకులకు, నిర్మాతలు ముందుకు రావడానికి ఆత్మస్థైర్యం కలుగుతుందని తెలిపారు. మరో నటుడు సూర్య శ్రీనివాస్ మాట్లాడుతూ.. ట్రైలర్ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉందని, సినిమా అంతకుమించి అద్భుతంగా ఉంటుందని అన్నారు. ఇందులో మంచి కమర్షియల్ హంగులతో పాటు బలమైన ఎమోషన్ ఉందని, ఈ చిత్రంలోని పృథ్వి పాత్ర తనలోని ధైర్యానికి అసలు అర్థం ఏంటో తెలిసేలా చేసిందని చెప్పుకొచ్చారు.
దర్శకుడు అక్కి విశ్వనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. ఇదొక సుదీర్ఘమైన, ఎంతో సవాలుతో కూడుకున్న జర్నీ అని అన్నారు. తమను ఆశీర్వదించడానికి వచ్చిన శైలేష్ కొలను, బీవీఎస్ రవిలకు కృతజ్ఞతలు తెలిపారు. నిహాల్, సూర్య, హర్షిత తదితరులు కొత్తవారైనా ఎంతో అనుభవజ్ఞులైన నటుల్లాగా అద్భుతంగా నటించారని, టెక్నికల్ పరంగా అత్యున్నత ప్రమాణాలతో ఈ చిత్రాన్ని నిర్మించామని తెలిపారు. ఈ వేడుకలో దీక్షా పంత్, హర్షిత, శ్రీష తదితరులు పాల్గొని సినిమా అనుభవాలను పంచుకున్నారు. సురేష్ రగుతు సినిమాటోగ్రఫీ, కార్తీక్ రోడ్రిగ్జ్ సంగీతం, మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలవనున్నాయి. ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ స్పై యాక్షన్ డ్రామా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.