సాగర్‌కు ఏపీ కన్నం.. రిజర్వాయర్ నుంచి నేరుగా టన్నెల్.. తాగునీటి ముసుగులో జలదోపిడీకి స్కెచ్
ఏటా కృష్ణా ఉమ్మడి జలాల దోపిడీకి పాల్పడుతూ వస్తున్న ఏపీ.. ఇప్పుడు మరింత బరితెగిస్తున్నది. నాగార్జున సాగర్ జలాశయం నుంచి నేరుగా డెడ్‌స్టోరేజీ నుంచైనా నీటిని అక్రమంగా తరలించుకుపోయేందుకు గుట్టుగా సొరంగమే తవ్వుతున్నది.
- డ్యామ్ కుడివైపు విజయపురి సౌత్‌లో గుట్టుగా సొరంగం తవ్వుతున్న ఏపీ
- డెడ్స్టోరేజీలోనూ నీళ్లు తరలించేలా రూ.1,200 కోట్లతో టన్నెల్ నిర్మాణం
- 1,658 కిలోమీటర్ల మేర పైప్‌లైన్.. 8 నెలల్లో పూర్తిచేసేలా శరవేగంగా పనులు
- చీమ కూడా అటువైపు రాకుండా నిఘా.. కట్టుదిట్టమైన భద్రత మధ్యే నిర్మాణం
- జల్‌జీవన్ మిషన్‌తో ఏపీకి కేంద్రం అండ.. బాబు వినతితో ప్రాజెక్టుకు పచ్చజెండా
- నిన్న పోతిరెడ్డిపాడు ద్వారా నీటి దోపిడీ .. రేపు సాగర్ నుంచే అక్రమ తరలింపు
- ఇంత జరుగుతున్నా నిద్రలో రాష్ట్ర ప్రభుత్వం.. సమాచారం లేదన్న సాగర్ అధికారులు
చెలరేగుతున్న చంద్రబాబు చేతులెత్తేసిన రేవంత్
ఇటు పోతిరెడ్డిపాడు పొక్క కొట్టినట్టే.. అటు నాగార్జునసాగర్‌కు కన్నం పెట్టేందుకు సిద్ధమైంది ఆంధ్రా ప్రభుత్వం. తాగునీటి ముసుగులో ప్రాజెక్టు నుంచి నేరుగా భారీ టన్నెల్‌ను నిర్మిస్తున్నది. గుట్టుగా పనులు చేపడుతున్నది. అది పూర్తయితే.. 510 అడుగుల డెడ్స్టోరేజీలోనూ సాగర్ నుంచి గ్రావిటీ ద్వారా నీటిని ఏపీ తరలించు కోవచ్చు. పైకి జల్‌జీవన్ మిషన్ ప్రాజెక్టుగా చెప్తున్నప్పటికీ.. అది ఓ మిష మాత్రమేనని నీటిపారుదల రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అటు గోదావరిలో, ఇటు కృష్ణాలో యథేచ్ఛగా నీళ్లు తరలించుకుపోయింది చంద్రబాబు ప్రభుత్వం. శ్రీశైలం నుంచి కోటాకు మించి కృష్ణా జలాలను వాడుకున్నది. కుప్పం దాకా పారించుకున్నది. సాగర్‌లోనూ కయ్యానికి దిగి నీళ్లు మలుపుకొన్నది. ఏపీ జలదోపిడీకి కాంగ్రెస్ సర్కారే ఇతోధికంగా సహకరించిందని, తెలంగాణను ఎండబెట్టి మరీ దిగువకు నీటిని సాగనంపిందని విమర్శలున్నాయి.
ఇప్పుడు సాగర్ వంతు!
ఇకనైనా స్పందిస్తావా రేవంతూ!
హాలియా, నవంబర్ 15 : ఏటా కృష్ణా ఉమ్మడి జలాల దోపిడీకి పాల్పడుతూ వస్తున్న ఏపీ.. ఇప్పుడు మరింత బరితెగిస్తున్నది. నాగార్జున సాగర్ జలాశయం నుంచి నేరుగా డెడ్‌స్టోరేజీ నుంచైనా నీటిని అక్రమంగా తరలించుకుపోయేందుకు గుట్టుగా సొరంగమే తవ్వుతున్నది. సాగర్ రిజర్వాయర్‌కు గండికోట్టి అక్కడి నుంచి తాగునీటి పేరిట నీటి అక్రమ తరలింపునకు పక్కా ప్రణాళికతో పనులు చేస్తున్నది. ఈ ప్రాజెక్టు తొలి దశను రూ.1,200 కోట్లతో చేపట్టినట్టు సమాచారం. దీనిని జల్‌జీవన్ మిషన్ కింద చేపడుతుండటంతో ఏపీ ప్రభుత్వ యత్నాలకు కేంద్రప్రభుత్వం అండదండలు ఉన్నాయని తెలుస్తున్నది.
దీంతో తెలంగాణకు ప్రమాదకర పరిస్థితులు దాపురించనున్నాయి. ఈ సొరంగ నిర్మాణమే పూర్తయితే తెలంగాణకు చుక్కనీరు కూడా వచ్చే పరిస్థితి ఉండదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంత జరుగుతున్నా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకర్ణుడి నిద్ర నటిస్తున్నదని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాగార్జునసాగర్‌లోని విజయపురి సౌత్ వద్ద ఏకంగా సొరంగం నిర్మిస్తున్నది. 8 నెలల వ్యవధిలో పనులు పూర్తిచేసి గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు తాగునీటిని అందిస్తారని తెలుస్తున్నది. దశలవారీగా చేపట్టే ఈ ప్రాజెక్టు పనులకు మొదటి దశలో రూ.1,200 కోట్లతో నిర్మిస్తున్నట్టు సమాచారం. దీనిని జల్‌జీవన్ మిషన్ కింద చేపడుతున్నట్టు తెలుస్తున్నది. 50 శాతం నిర్మాణ వ్యయాన్ని ఏపీ ప్రభుత్వం భరించనున్నది.

ఏ ప్రభుత్వమైనా ఆ ఏడాది చేపట్టే పనులకు బడ్జెట్లో నిధులను కేటాయిస్తుంది. ఈ ప్రాజెక్టు విషయంలో ఎవరికీ తెలియకుండా ఉండేందుకు బడ్జెట్లో నిధులు కేటాయించలేదని విశ్వసనీయ సమాచారం. ఇంత జరుగుతున్నా తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం లేకపోవడం గమనార్హం. నిజంగా తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం లేదా? కేంద్ర ప్రభుత్వం, తన రాజకీయ గురువు చంద్రబాబునాయుడు మెప్పుకోసం సీఎం రేవంత్‌రెడ్డికి తెలిసినా తెలియనట్టు నటిస్తున్నారా? అన్నది ఇప్పుడు అందరి మెదళ్లను తొలుస్తున్న మిలియన్ డాలర్ల ప్రశ్న. తాగునీటి అవసరాల పేరుతో కృష్ణా జలాలను తరలించుకుపోయేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ఏడాదికాలంగా రహస్యంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నది.
గ్రావిటీ నీటిని తరలించేలా..
నాగార్జునసాగర్ జలాశయంలో నీరు 510 అడుగుల డెడ్‌స్టోరేజీలో ఉన్నప్పటికీ గ్రావిటీ ద్వారా నీటిని తరలించేందుకు అనుకూలంగా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం సొరంగం తవ్వుతున్నది. సాగర్ విజయపురి సౌత్‌లో నాగార్జునసాగర్ డ్యామ్ కుడివైపు ముందు భాగంలో ఈ సొరంగాన్ని తవ్వుతున్నది. రోజుకు 160 ఎంఎల్డీ (మిలియన్ లీటర్స్ పర్ డే) సామర్థ్యంతో అధునాతనమైన వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణాన్ని ఇప్పటికే పూర్తిచేశారు. ముందుగా ఇన్‌టెక్ వెల్‌లో నీటిని నింపి నాలుగు ప్రాంతాల్లో నిర్మించిన భారీ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లకు తరలిస్తారు. రిజర్వాయర్లలో నింపిన నీటిని తర్వాత దశలో ఒక్కొక్కటి 50 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన 4 సంపుల్లో నింపుతారు.
ఆ నీటికి కొత్తగా నిర్మించిన 200 ఓవర్‌హెడ్ ట్యాంకులకు పంపుతారు. వీటన్నింటినీ అనుసంధానం చేసేందుకు 1,658 కిలోమీటర్ల పైపులైన్ నిర్మిస్తున్నారు. అవసరాన్ని బట్టి అక్కడక్కడా చిన్నచిన్న లిఫ్టులను కూడా నిర్మించేందుకు పనులు జరుగుతున్నాయని సమాచారం. తాగునీరే కాదు.. గ్రావిటీ ద్వారా ఆ నీటిని సాగుకూ ఉపయోగించుకునేందుకు ఏపీ ప్రభుత్వం భారీ సీక్రెట్ ప్రణాళికను అమలు చేస్తున్నది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు డెడ్‌స్టోరేజీలో ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జలాశయం నుంచి సునాయాసంగా నీటిని తరలించుకుపోవడానికి ఈ ప్రాజెక్టు రూపకల్పన చేస్తున్నది. అమరజీవి జలపథకం ద్వారా పల్నాడు జిల్లాలో 6.53 లక్షల మందికి రోజుకు 50 లీటర్ల చొప్పున మంచినీటిని అందించడమే ఈ పథకం లక్ష్యం. ఈ పథకం పనులను 2027లో పూర్తిచేసి కొత్తగా 95 వేల కుటుంబాలకు మంచినీటి కనెక్షన్లు ఇవ్వడానికి వేగవంతంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.

కట్టుదిట్టమైన భద్రత
ఈ ప్రాజెక్టు నిర్మాణ స్థలంలో ఏపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటుచేసింది. అనుమతి లేకుండా ఏ ఒక్కరినీ అటువైపు పోనివ్వడం లేదు. పనిజరిగే ప్రాంతంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థతోపాటు భారీగా పోలీసులను మోహరించారు. ప్రాజెక్టు నిర్మాణ సమాచారం మీడియాకు, స్థ్ధానికులకు అందకుండా పకడ్బందీ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇరు రాష్ట్రాల వైరానికి మరింత ఆజ్యం
తాగునీటి అవసరాల పేరుతో ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్టు రెండు తెలుగు రాష్ర్టాల మధ్య వైరానికి మరింత ఆజ్యం పోసినట్టయింది. కృష్ణాజలాల కేటాయింపులో తమకు అన్యాయం జరుగుతున్నదంటూ ఎల్ నినో నేపథ్యంలో తెలంగాణ ప్రాంతానికి 200 టీఎంసీల నీటిని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేఆర్ఎంబీని కోరింది. రెండు రాష్ర్టాల వాదనలు విన్న బోర్డు ఎటూ తేల్చకుండానే సమావేశాన్ని వాయిదా వేసింది. ఏపీ ప్రభుత్వం మాత్రం నాగార్జునసాగర్ జలాశయం నుంచి నేరుగా నీటిని అక్రమంగా తరలించుకుపోయేందుకు ఈ ప్రాజెక్టు చేపట్టడం వివాదాలకు తావిచ్చినట్టయింది. ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వ జల్‌జీవన్ మిషన్ కింద చేపట్టడం, దానికి కేంద్ర ప్రభుత్వం 50 శాతం నిధులు ఇవ్వడంతో ఏపీకి కేంద్రం అండ దొరికినట్టయింది. కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని చూసుకొని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరింత దూకుడుగా ముందుకుపోతున్నారు. ఇప్పటికే కృష్ణాజలాల్లో తెలంగాణకు రావాల్సిన నీటి వాటా రావడం లేదు. దీనికి తోడు కొత్తగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుతో తెలంగాణ ప్రాంతానికి మరింత అన్యాయం జరుగుతుందని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
సమాచారం లేదన్న ఎన్ఎస్పీ అధికారులు
ఏపీప్రభుత్వం చేపట్టిన తాగునీటి ప్రాజెక్టు నిర్మాణం గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని నాగార్జునసాగర్ డ్యామ్ ఎస్ఈ మల్లికార్జున్‌రావును వివరణ ఇచ్చారు. త్వరలో జరుగబోయే కృష్ణా యాజమాన్య బోర్డు సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తామని ఆయన తెలిపారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కూతవేటు దూరంలో ఏపీ ప్రభుత్వం గత కొంతకాలంగా రేయింబవళ్లు పనులు చేయిస్తున్నా తెలంగాణ రాష్ర్టానికి చెందిన సాగర్ ప్రాజెక్టు అధికారులు మాత్రం తమకు సమాచారం లేదని, తెలియదని చెప్పడం గమనార్హం.
కేసీఆర్ పాలన మినహా తెలంగాణకు అన్యాయం
1956 నుంచి 2026 వరకు తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలన మినహా కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాల హయాంలో కృష్ణాజలాల్లో ఆంధ్ర జలదోపిడీ మాత్రం ఆగలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి సీఎం రేవంత్‌రెడ్డి పాలన వరకు తెలంగాణ భూములను ఎండబెట్టి, ఆంధ్రా ప్రాంతానికి కృష్ణా జలాలను అక్రమంగా తరలించుకుపోయారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2014 నుంచి 2023 వరకు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఏపీ జలదోపిడీకి చెక్‌పెట్టింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనకు కేటాయించిన దానికి మించి కృష్ణాజలాలను వాడుకొంటున్నట్టు గతంలోనే కేసీఆర్ ప్రభుత్వం కేఆర్ఎంబీ ఎదుట తన వాదనలు వినిపించారు. నీటి విడుదల విషయంలో ఇదే నాగార్జునసాగర్ ఆనకట్ట మీద ఆంధ్ర-తెలంగాణ ప్రాంత పోలీసులు, అధికారులు ఘర్షణకు దిగిన దాఖలాలు అనేకం ఉన్నాయి. 2023లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీ జలదోపిడీ మళ్లీ ప్రారంభమైంది. నిన్నటివరకు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులరేటర్ ద్వారా కృష్ణా జలాలను రాయలసీమకు అక్రమంగా తరలించుకుపోయిన ఆంధ్రా.. నేడు పల్నాడు జిల్లాలోని గ్రామాలకు తాగునీటి సరఫరా పేరుతో నేరుగా సాగర్ జలాశయం నుంచి కృష్ణా జలాలను అక్రమంగా తరలించుకుపోయేందుకు కుట్రలకు దిగింది. గత ఏడాది కాలంగా మంచినీటి ప్రాజెక్టు నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నా తెలంగాణ ప్రభుత్వం కండ్లప్పగించి చూస్తున్నది. ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం గానీ, కేఆర్ఎంబీ గానీ స్పందించకపోవడం విడ్డూరంగా ఉన్నది.
తెలంగాణకు తీరని నష్టం
నాగార్జునసాగర్ డ్యామ్ కుడివైపున విజయపురి సౌత్‌లో రిజర్వాయర్ ముందు భాగం నుంచి ఏపీ ప్రభుత్వం నీటిని తరలించుకుపోవాలని చూడటం నిబంధనలకు విరుద్ధం. ఇది రాష్ట్ర రైతాంగానికి తీరని నష్టం కలిగిస్తుంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఆంధ్రా జలదోపిడీని అడ్డుకోవాలి. లేకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ ప్రాంత రైతాంగంతో కలిసి భారీ ఎత్తున ఉద్యమాలు చేపడుతాం.
– నోముల భగత్‌కుమార్, నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

