‘సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకొనే లాజిక్లను పక్కనపెట్టి ప్రేక్షకుల్ని నవ్వించాలనే ధ్యేయంతో ఈ సినిమా చేశాం’ అని అన్నారు నాగచైతన్య. నాగార్జునతో కలిసి ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘బంగార్రాజు’. కల్యాణ్‌కృష్ణ దర్శకుడు. ఈ నెల 14న విడుదలకానుంది. ఈ సందర్భంగా నాగచైతన్య పాత్రికేయులతో పంచుకున్న ముచ్చట్లివి..
బంగార్రాజు పాత్రకు న్యాయం చేయడం సవాల్‌గా అనిపించిందా?
‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమాతో బంగార్రాజు పాత్రకు కొత్త ఇమేజ్ను తీసుకొచ్చారు నాన్న. ఆ అంచనాల్ని అందుకుంటూ పాత్రకు న్యాయం చేయడం చాలెంజింగ్‌గా అనిపించింది. సినిమాను అంగీకరించే ముందు నాలో ఉన్న సంశయాలన్నీ నాన్నతో పాటు దర్శకుడు కల్యాణ్‌ను అడిగి నివృత్తి చేసుకున్నా. బాడీలాంగ్వేజ్, యాసను పలకడంతో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంలో నాన్న చక్కటి సలహాలిచ్చారు.
ట్రైలర్లో నాగార్జునతో పోలిస్తే మీ పాత్రకు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చారు? ఎందుకలా?
సినిమాలో మా ఇద్దరి పాత్రలకు సమ ప్రాధాన్యత ఉంటుంది. బంగార్రాజు పాత్ర దృక్కోణం నుంచే కథ సాగుతుంది. నాన్న, రమ్యకృష్ణ పాత్రలు కథను ముందుకు నడిపిస్తాయి మనవడు చిన్న బంగార్రాజుకు ఎదురైన సమస్యలను తాత బంగార్రాజు ఎలా పరిష్కరించాడన్నది ఆకట్టుకుంటుంది.
కొవిడ్ ఉధృతితో పాటు టికెట్ల రేట్ల సమస్యల ప్రభావం సినిమాపై ఎంతవరకు ఉంటుందని అనుకుంటున్నారు.
టికెట్ల రేట్ల ప్రభావం మా సినిమాపై పెద్దగా ఉండదనుకుంటున్నా. ప్రస్తుతమున్న టికెట్ రేట్స్‌ను దృష్టిలో పెట్టుకొని సినిమా బడ్జెట్‌ను నిర్ణయించాం. ఒకవేళ టికెట్ రేట్లు పెరిగితే మాకు అది బోనస్ అవుతుంది. నేను కేవలం యాక్టర్‌ను మాత్రమే. నటించడం తప్ప ఇతర విషయాల్లో పెద్దగా జోక్యం చేసుకోను. ఓ సినిమాను మొదలుపెట్టే ముందే నా వైపు నుంచి నిర్మాతకు ఎలాంటి సహాయసహకారాలు అందించగలుగుతానో చెబుతాను. ఇద్దరికి కంఫర్ట్ అనిపిస్తేనే ప్రయాణాన్ని మొదలుపెడతాం.
ఇటీవల కాలంలో మీ జీవితంలో ఎదురైన కఠిన పరిస్థితులను ఎలా అధిగమించారు?
ఇద్దరి మంచి కోసమే విడాకులు తీసుకున్నాం. ఆ నిర్ణయం విషయంలో తను(సమంత) హ్యాపీ. నేను సంతోషంగా ఉన్నా. మా ఇద్దరి కెరీర్‌పరంగా ఆ నిర్ణయం తీసుకోవడమే మంచిదనిపించింది.
తదుపరి సినిమా విశేషాలేమిటి?
విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న ‘థాంక్యూ’ సినిమా ఎనభైఐదు శాతం షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా తర్వాత విక్రమ్ దర్శకత్వంలోనే హారర్ కథాంశంతో ఓ వెబ్‌సిరీస్ చేయబోతున్నా. హిందీలో ఆమిర్‌ఖాన్‌తో ‘లాల్‌సింగ్ చద్దా’ సినిమా చేశా. దర్శకులు పరశురామ్, విజయ్కనకమేడల సినిమాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.