క్రికెట్లో అనితరసాధ్యమైన రికార్డులు నెలకొల్పిన భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన అనుభవాలను పంచుకున్నాడు. అరంగేట్రం నుంచి స్టార్ క్రికెటర్‌గా ఎదిగే క్రమంలో ఎదుర్కొన్న సవాళ్లు, ప్రతిసవాళ్లను వివరించాడు. తన జీవితమే ఒక ఉదాహరణ అన్న..విరాట్ అనుకుంటే ఏదైనా సాధించవచ్చని అన్నాడు. వంద టెస్టు మ్యాచ్‌లు ఆడుతానని ఎప్పుడు అనుకోలేదన్న కోహ్లీ..తన సహచరి అనుష్కశర్మ సహకారం మరువలేనిదని చెప్పుకొచ్చాడు. మొహాలీలో శ్రీలంకతో వందో టెస్టు ఆడబోతున్న కోహ్లీ బీసీసీఐ టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరు అంశాలను పంచుకున్నాడు.
మొహాలీ: మార్చి 4, 2022..భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కెరీర్లో మరుపురాని, మరిచిపోలేని సందర్భం. సరిగ్గా 14 ఏండ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఈ 33 ఏండ్ల డాషింగ్ బ్యాటర్ అనతి కాలంలోనే దిగ్గజాల సరసన చేరాడు. తన దూకుడు బ్యాటింగ్‌కు తోడు, విలక్షణమైన నాయకత్వంతో భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాల్లో కీలక భూమిక పోషించాడు. అప్పటి వరకు స్వదేశంలోనే పులులు అనుకున్న టీమ్ఇండియా..విదేశాల్లో బెబ్బులిలా మార్చాడు. మనసు పెట్టి ఆడితే ప్రత్యర్థి ఎవరైనా మట్టికరిపించవచ్చని చేతల్లో చూపించాడు. లంకతో తొలి టెస్టు ద్వారా వందో మ్యాచ్ ఆడబోతున్న కోహ్లీ.. ఇంటర్వ్యూ అతని మాటల్లోనే..
‘భవిష్యత్‌లో ఏం జరుగుతుందో తెలియదు. అలాంటప్పుడు ప్రతీ దానికి మనం భయపడాల్సిన అవసరం లేదు. అదే సమయంలో కృంగిపోవాల్సింది లేదు. పట్టుదలతో ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చనే దానికి నా జీవితం, కెరీర్ సరైన
మొహాలీ స్టేడియంలో 50 శాతం మంది ప్రేక్షకుల సమక్షంలో ఆడనున్న శుక్రవారం ఉదయం నాకు చాలా స్పెషల్. ఫ్యాన్స్ కేరింతలు, ఊలలు, చప్పట్ల హోరు మధ్య ఆడటం ఎప్పటికీ మరిచిపోలేని అనుభూతి. తొలి మ్యాచ్ నుంచి మొదలుపెడితే భారత్‌కు ఆడిన ప్రతీసారి కడుపులో ఏదో తెలియని అనుభూతి. అదీ కలుగనప్పుడు మన కెరీర్ ఇక ముగిసినట్లే.
ఇది నమ్మశక్యంగా లేదు. భారత్ తరఫున వంద టెస్టులు ఆడుతానని ఎప్పుడు అనుకోలేదు. ఇదో సుదీర్ఘ ప్రయాణం. ఇప్పటి వరకు ఎన్నో అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాను. దేవుని కృపతో ఇదంతా జరిగింది. ముఖ్యంగా ఫిట్నెస్ విషయంలో చాలా కష్టపడ్డాను. ఇది నాతో పాటు కుటుంబానికి, కోచ్‌కు చిరస్మరణీయ సందర్భం.
భారత్‌కు ప్రాతినిధ్యం వహించడాన్ని అదృష్టంగా భావిస్తాను. కొంది మందికే ఈ అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా క్రికెట్‌కు మూలధారమైన టెస్టు ఫార్మాట్లో అద్భుత విజయాలు సాధించడం మామూలు విషయం కాదు. టెస్టు జట్టుకు కెప్టెన్సీ చేపట్టిన తర్వాత జట్టు ఆలోచన విధానం మారిపోయింది. అందుకోసం నా దేహాన్ని అకింతం చేశాను. పూర్తి శక్తి సామర్థ్యాలు ఉపయోగిస్తూ నా విధులు నిర్వర్తించాను.
టెస్టు కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న తర్వాత ఒక విజన్‌తో ముందుకెళ్లాను. సహచరుల్లో స్ఫూర్తిని కల్గించాను. స్వదేశంలోనే కాదు..విదేశాల్లోనూ విజయాలు సాధిస్తామన్న నమ్మకాన్ని ప్రోది చేశాను. అందకు ప్రతిఫలమే టెస్టుల్లో ఏడవ ర్యాంక్ నుంచి అగ్రస్థానానికి చేరుకున్నాం. ఇది చాలా గర్వంగా అనిపిస్తుంది.
కెరీర్లో ఎవరికైనా తొలి సెంచరీ మరిచిపోలేని జ్ఞాపకం. అవును ఆస్ట్రేలియాతో 2012లో అడిలైడ్ టెస్టులో సెంచరీ చేయడం నా కెరీర్లో అద్భుతమైన క్షణం. ఇప్పటికీ ఆ సందర్భం నా కండ్ల ముందు కదలాడుతూనే ఉన్నది. అది చాలా ప్రత్యేకమైన సందర్భం. ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై సెంచరీ కొట్టడం ఒక యువ క్రికెటర్‌గా టెస్టుల్లో నిరూపించుకునేందుకు శతకం ఉపయోగపడింది. ఆసీస్‌పై సెంచరీ చేసిన ఆత్మవిశ్వాసం ఆ తర్వాత కెరీర్లో టానిక్‌లా ఉపయోగపడింది. ఆకాశమే హద్దుగా చెలరేగేలా చేసింది. ముఖ్యంగా 2015-20 మధ్య కాలంలో ఆడిన సిరీస్‌లు ప్రతీది చిరస్మరణీయమే.
అనుష్కతో జత కలువడం నా జీవితాన్ని మార్చేసింది. మంచి మార్గంలో పయనించేందుకు ఇది దోహదపడింది. అనుష్క లాంటి భార్య దొరికినందుకు ఆ దేవుడికి రుణపడి ఉంటాను. నా బలానికి ఆమె ఒక పిల్లర్లాంటిది. ఒకరి కెరీర్ ఎదుగుదలకు ఒకరం సహకరించుకున్నాం. ఆమె నా జీవితంలో లేకుంటే ఇది సాధ్యపడేది కాదు.