మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): మహిళలకు ఎదురయ్యే న్యాయపరమైన సమస్యలు పరిష్కరించడంలో తెలంగాణ మహిళా కమిషన్ ముందుండాలని చైర్పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి సభ్యులకు సూచించారు. కమిషన్లో నమోదయ్యే కేసుల తక్షణ పరిష్కారానికి అవసరమైతే లీగన్ సర్వీసెస్ అధికారుల సహకారం తీసుకోవాలని చెప్పారు. శనివారం హైదరాబాద్లోని కమిషన్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళల రక్షణే ప్రధాన ఎజెండాగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ మహిళలకు అనేక సౌకర్యాలు, అధికారాలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. మహిళల పట్ల అనుచిత ప్రవర్తనను నిరోధించే సెక్షన్లను కఠినంగా అమలుచేయాలని, లైంగికదాడి బాధితులకు ఆర్థికసాయం సత్వరమే అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరాలనే తీర్మానాలను ఆమోదించారు. సమావేశంలో కమిషన్ సభ్యులు షరీన్ అఫ్రోజ్, ఈశ్వరీబాయి, కొమ్ము ఉమాదేవియాదవ్, గద్దల పద్మ, సుదాల లక్ష్మి, కటారి రేవతిరావు, కమిషన్ కార్యదర్శి సునంద పాల్గొన్నారు.