MSG |సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి పూర్తిస్థాయి కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందించారు. చిరంజీవికి జోడీగా లేడీ సూపర్‌స్టార్ నయనతార నటించగా, వెంకటేష్ ప్రత్యేక కేమియో సినిమాపై ఉన్న క్రేజ్‌ను మరింత పెంచింది. భారీ బడ్జెట్‌తో సాహు గారపాటి, సుస్మిత ఈ చిత్రాన్ని నిర్మించగా, సెన్సార్ నుంచి ‘U/A’ సర్టిఫికేట్ పొందింది. ఆదివారం రాత్రి జరిగిన ప్రీమియర్ షోలతోనే సినిమాకు పాజిటివ్ టాక్ మొదలైంది. ముఖ్యంగా చిరంజీవి వింటేజ్ ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ అభిమానులను ఫుల్‌గా అలరిస్తున్నాయని టాక్ వినిపిస్తోంది. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రేక్షకులను బాగా కనెక్ట్ చేస్తుండగా, వెంకటేష్ కేమియో సీన్స్ థియేటర్లలో విజిల్స్ వేయిస్తున్నాయని రివ్యూలు చెబుతున్నాయి. నయనతార పాత్రకు సరైన వెయిటేజ్ ఇవ్వడం కూడా సినిమాకు ప్లస్ పాయింట్‌గా మారింది. మొత్తంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు మెగా ఫ్యాన్స్‌ను టార్గెట్ చేసిన కంటెంట్‌గా ఈ సినిమా నిలిచిందని ప్రీమియర్ టాక్ స్పష్టం చేస్తోంది.
ట్రేడ్ పరంగా చూస్తే, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రీమియర్ షోలు మరియు టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇవ్వడంతో అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా నమోదయ్యాయి. జీఎస్టీతో కలిపి ప్రీమియర్ షో టికెట్ ధరను రూ.600గా నిర్ణయించగా, జనవరి 11 రాత్రి వివిధ షోస్ విజయవంతంగా నిర్వహించారు. యూఎస్ మార్కెట్లో ఈ చిత్రం ఇప్పటికే వన్ మిలియన్ డాలర్ల కలెక్షన్‌కు చేరువగా ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్‌తో పాటు ప్రీమియర్స్ కలిపి తొలి రోజే రూ.30 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు సమాచారం.
ఇక థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే, తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు భారీ ట్రేడ్ నమోదైంది. నైజాంలో రూ.31 కోట్లు, రాయలసీమలో రూ.18 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.14 కోట్లు, గుంటూరులో రూ.9 కోట్లు, తూర్పు గోదావరిలో రూ.9.50 కోట్లు, పశ్చిమ గోదావరిలో రూ.7.20 కోట్లు, కృష్ణాలో రూ.7.25 కోట్లు, నెల్లూరులో రూ.4.25 కోట్లకు థియేట్రికల్ హక్కులు అమ్ముడయ్యాయి. ఈ లెక్కన ఏపీ–తెలంగాణ మార్కెట్లో మొత్తం రూ.105 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ అంచనా. ఈ రెండు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ సాధించాలంటే సినిమా కనీసం రూ.210 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది. తెలుగేతర ప్రాంతాల్లో కర్ణాటక హక్కులు సుమారు రూ.10 కోట్లకు, ఇతర రాష్ట్రాల రైట్స్ రూ.5 కోట్లకు అమ్ముడయ్యాయి. దేశవ్యాప్తంగా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను ట్రేడ్ వర్గాలు రూ.240 కోట్ల గ్రాస్‌గా లెక్కిస్తున్నాయి. ఓవర్సీస్ మార్కెట్లో నార్త్ అమెరికా హక్కులు సుమారు రూ.20 కోట్లకు డీల్ అయినట్లు సమాచారం. అక్కడ డిస్ట్రిబ్యూటర్ లాభాల్లోకి రావాలంటే కనీసం 5 మిలియన్ డాలర్ల కలెక్షన్ అవసరమని అంచనా.
మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు సుమారు రూ.140 కోట్ల వరకు ప్రీ రిలీజ్ ట్రేడ్ జరిగినట్లు ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. ఈ స్థాయి బిజినెస్ నేపథ్యంలో పూర్తి స్థాయి బ్రేక్ ఈవెన్ సాధించాలంటే సినిమా రూ.250–280 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉంటుందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పాజిటివ్ టాక్ కొనసాగితే, ఈ సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో ‘మన శంకర వరప్రసాద్ గారు’ మెగాస్టార్ రేంజ్ రికార్డులను తిరగరాయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.