రోషన్ కనకాల, సాక్షి మదోల్కర్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ డ్రామా ‘మోగ్లీ 2025’. సందీప్‌రాజ్ దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతిప్రసాద్ నిర్మిస్తున్నారు. డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం చిత్ర టీజర్‌ను అగ్ర హీరో ఎన్టీఆర్ విడుదల చేశారు. హాయిగా జీవితాన్ని గడిపే యువకుడు మోగ్లీ..ఓ అందమైన అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆమే అతని ప్రపంచంగా మారుతుంది. వీరిద్దరి ప్రేమకథకు రాక్షసుడు వంటి ఓ పోలీసాఫీసర్ అడ్డంకిగా మారతాడు.
ఈ నేపథ్యంలో చోటుచేసుకునే అనూహ్య సంఘటనలతో టీజర్ ఆసక్తిని పంచింది. అటవీ నేపథ్యంలో మైథాలజీ ఫీల్‌తో ఈ కథ సాగింది. రోషన్ కనకాల ఉత్తరాంధ్ర యాసలో చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. చెవిటి, మూగ అమ్మాయిగా కథానాయిక సాక్షి మదోల్కర్ సహజమైన నటనను కనబరచింది. విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఫారెస్ట్ నేపథ్యంలో ఇంటెన్స్ లవ్‌స్టోరీగా మెప్పిస్తుందని మేకర్స్ తెలిపారు. బండి సరోజ్‌కుమార్, హర్ష చెముడు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కాలభైరవ, రచన-దర్శకత్వం: సందీప్‌రాజ్.