న్యూఢిల్లీ: టీమ్ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై స్పీడ్‌స్టర్ మహమ్మద్ సిరాజ్ తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఒక సోదరుడిలా ప్రోత్సహించిన కోహ్లీ తనకు ఎప్పటికీ కెప్టెన్ అని సిరాజ్ అన్నాడు. టెస్టు కెప్టెన్సీ నుంచి విరాట్ వైదొలిగిన నేపథ్యంలో సిరాజ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా భావోద్వేగానికి లోనయ్యాడు. ‘నువ్వే నా సూపర్ హీరో. నీ నుంచి లభించిన మద్దతు.. ప్రోత్సాహానికి కృతజ్ఞతలతో సరిపెట్టలేను. నన్ను ఎప్పుడూ ఒక సోదరుడిలా మార్గనిర్దేశం చేశావు. ఇన్నేండ్లుగా నన్ను నమ్మి.. విశ్వసించినందుకు ధన్యవాదాలు. ఎప్పటికీ నువ్వు నా కెప్టెన్‌వే’ అని పోస్టు చేశాడు. కోహ్లీ, సిరాజ్ మధ్య అనుబంధం విడదీయలేనిది. విరాట్ సారథ్యంలోనే భారత్ తరఫున సిరాజ్ టెస్టు, వన్డే, టీ20 క్రికెట్లోకి అడుగుపెట్టాడు. వీరిద్దరూ ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టులో కొనసాగుతున్నారు.