సిటీబ్యూరో, డిసెంబర్ 12(నమస్తే తెలంగాణ)/ ఖైరతాబాద్, డిసెంబర్ 12: ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఎక్స్పో ఆదివారం ముగిసింది. పీపుల్స్ ప్లాజాలో రెండు రోజుల పాటు జరిగిన ఈవీ ఎక్స్పోలో వాహనదారులకు కంపెనీలు అవగాహన కల్పించాయి. విభిన్న రకాల ఎలక్ట్రిక్ వాహనాలు ప్రదర్శనలో అలరించాయి. ఈవీ వెహికిల్స్ వినియోగం, ధరలు, పర్యావరణ రక్షణ, ప్రభుత్వ ప్రోత్సాహకాలు తదితర విషయాలను వాహనదారులు తెలుసుకున్నారు.
గో ఎలక్ట్రిక్ పేరుతో ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ వెహికిల్ ఎక్స్పోను ఎమ్మెల్సీ సురభి వాణీదేవి ఆదివారం సందర్శించారు. వివిధ స్టాళ్లకు వెళ్లి విద్యుత్, బ్యాటరీ వాహనాల పనితీరును నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. స్వయంగా ఓ విద్యుత్ వాహనంపై కూర్చొని దాని పనితీరును పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ విద్యుత్ వాహనాలతో పర్యావరణ పరిరక్షణ, వినియోగదారులకు ఆర్థిక భారం తగ్గుతుందన్నారు. ఇప్పుడు వాడుకలో ఉన్న పెట్రోల్, డీజిల్ ఆటోలను సైతం విద్యుత్ వాహనాలుగా మార్చుకోవచ్చన్నారు. అనంతరం, పలు స్టాళ్ల నిర్వాహకులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.