సూర్యాపేట : రైతులకు పంటలను దూరం చేస్తున్న పాపం కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం నూర్జహన్ పేట, గూడెపుకుంట తండా గ్రామాలలో ఎండిన పంటపొలాలను సందర్శించారు. రైతులతో ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకొని మీడియాతో మాట్లాడారు. ఏ గ్రామంలో చూసినా వందల ఎకరాలు ఎండిపోయినయ్. కాలం పరిస్థితి చూసే రైతులు సగం పొలాలే నాటుపెట్టుకున్నరు. అందులోనూ సగం పైన పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందన్నారు. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని ఉన్నట్లగా పరిస్థితి మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
నీళ్లు, కరెంట్ పుష్కలంగా ఉన్నా కాంగ్రెస్కు పాలన చేతకాక పంటలు ఎండబెట్టుకోవాల్సిన దుస్థితి దాపురించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంటును కూడా సరిగ్గా ఇవ్వలేక మోటర్లు కాలిపోయే దుస్థితి నెలకొంది. రైతుల పట్ల రేవంత్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహారిస్తుందని మండిపడ్డారు. పంటలు చేతికొచ్చే సమయంలో కావాలనే పంటలను ఎండబెడుతున్నరు. రైతులను ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వం ముందుకు సాగలేదన్నారు. ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ దయ్యం, రేవంత్ భూతం పట్టింది.
ఆ దయ్యాలు, భూతాలను ఎట్లా వదిలించాలో రైతులకు తెలుసన్నారు. ప్రశ్నిస్తే తప్ప ఈ ప్రభుత్వానికి కనికరం ఉండదు. కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రాన్ని సాధించుకొని పదేండ్లు సస్యశ్యామలంగా పంటలు పండించుకున్నం. మరో మారు పంటలు కాపాడుకునేందుకు పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మంత్రులను హెచ్చరిస్తున్నా.. ఇదే పరిస్థితిలో కొనసాగిస్తే రైతులు మీ వెంట పడటం ఖాయమన్నారు. కెసిఆర్, కేటీఆర్, హరీశ్ రావు మీద, నా మీద దాడులు చేస్తే ఎండిపోయిన పొలాలు మర్చిపోతయా? మీ డైవర్షన్ పాలిటిక్స్ తో ప్రజల ఇబ్బందులు తొలిగిపోతాయా? అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పంటలకు నీళ్లు, కరెంట్ పై దృష్టి పెడితే మంచిది. లేదంటే ప్రజల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుందని హెచ్చరించారు.