‘క్రైమ్ కథాంశానికి చక్కటి సందేశాన్ని జోడించి సినిమాను బ్రహ్మాండంగా తెరకెక్కించారు. టీజర్ చూస్తుంటే సినిమా పెద్ద విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం కలుగుతుంది’ అని అన్నారు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్. బుధవారం హైదరాబాద్‌లో ‘మై నేమ్ ఈజ్ శృతి’ ఫస్ట్‌లుక్, టీజర్‌ను మంత్రి విడుదలచేశారు. హన్సిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి డి. శ్రీనివాస్ ఓంకార్ దర్శకుడు. వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై బురుగు రమ్య ప్రభాకర్ నిర్మించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ ‘కొత్తదనాన్ని నమ్మి దర్శకనిర్మాతలు చేసిన మంచి ప్రయత్నమిది. ధైర్యంగా వారు సినిమాను నిర్మించడానికి అభినందనీయం’ అని తెలిపారు. హన్సిక మాట్లాడుతూ ‘ఈఏడాది విడుదలకానున్న నా తొలి సినిమా ఇది. తప్పకుండా తెలుగు ప్రేక్షకుల్ని మెప్పిస్తుందనే నమ్మకముంది’ అని చెప్పింది. ‘విభిన్నమైన కథాంశమిది. రిస్క్‌తో కూడుకున్న ఈ పాయింట్‌ను నమ్మి కమర్షియల్ పంథాలో పెద్దనటీనటులతో రూపొందించడానికి నిర్మాత అంగీకరించడం ఆనందంగా ఉంది. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటా’ అని దర్శకుడు చెప్పారు. ఓ యువతి జీవనసంఘర్షణకు దృశ్యరూపంగా సినిమా ఉంటుందని, సొంత సినిమాగా భావించి ప్రతి ఒక్కరూ కష్టపడ్డారని నిర్మాత పేర్కొన్నారు.
బలవంతపు నిర్ణయాలు తీసుకోం
హైదరాబాద్‌ను సినీ హబ్‌గా తీర్చిదిద్దాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయమని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. కరోనా ఉధృతి కారణంగా సినీ పరిశ్రమలో నెలకొన్న సంక్షుభిత పరిస్థితుల గురించి మంత్రి మాట్లాడుతూ ‘సినీ పరిశ్రమను అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడు సిద్ధంగా ఉన్నది. సినీ రంగం నష్టాలను తగ్గించడం కోసమే టికెట్ల రేట్లను పెంచాం. చిన్న సినిమాల్ని ప్రోత్సహించడానికి ఐదో ఆటకు అనుమతులు ఇచ్చాం. థియేటర్స్ ఇబ్బందులపై అందరితో చర్చిస్తాం. సినీ పరిశ్రమపై ఆధారపడిన లక్షలాది మందికి ప్రభుత్వం, ప్రజలు తోడుండాల్సిన అవసరముంది. బలవంతపు నిర్ణయాలతో కోట్లు రూపాయలు ఖర్చుపెట్టి సినిమాలు తీస్తున్న నిర్మాతలకు ఇబ్బందులు కలిగించే పనులను ప్రభుత్వం ఎప్పటికీ చేయదు. పరిస్థితులకు అనుగుణంగా సందర్భానుసారంగా అందరికీ మేలు చేసేలా అవసరమైన చర్యలు చేపడుతాం. ఏపీలోని థియేటర్ల సమస్యపై ఆ రాష్ట్ర మంత్రులతో మాట్లాడుతాను’ అని అన్నారు.