హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ) : పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని మంత్రి సీతక్క హెచ్చరించారు. అధికారులు క్షేత్రస్థాయిలో బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు. సోమవారం సచివాలయం నుంచి జిల్లా పంచాయతీ అధికారులతో.. పారిశుద్ధ్య నిర్వహణ, నిధుల వినియోగం, వనమహోత్సవం, తాగునీరు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని, దోమల వ్యాప్తిని అరికట్టేందుకు బ్లీచింగ్ పౌడర్ చల్లడం, ఫాగింగ్ తప్పనిసరిగా చేపట్టాలని ఆదేశించారు. ప్రతి వారంలో ఒకరోజు డ్రై డే నిర్వహించి ఎకడా నీరు నిల్వ ఉండకుండా చూడాలని సూచించారు.