అసెంబ్లీలో నిలదీసిన అక్బరుద్దీన్ కేసీఆర్ సాబ్ దిల్వాలే చీఫ్ మినిస్టర్. ఆయన సీఎంగా ఉన్నప్పుడు రంజాన్ తోఫా ఇచ్చేవారు. చీరలిచ్చేవారు, బట్టలిచ్చేవారు. కాంగ్రెస్ వచ్చాక ఏవీ లేవు.
-శాసనసభలో ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్
Akbaruddin Owaisi | హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అసెంబ్లీలో ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ప్రశంసలు కురిపించారు. సోమవారం బడ్జెట్ పద్దులపై జరిగిన చర్చలో మాట్లాడిన ఆయన గత బీఆర్ఎస్ పాలనలో అమలైన పథకాలను మెచ్చుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ముస్లింలకు ఏమీ ఇవ్వట్లేదని ధ్వజమొత్తారు. కేవలం చిన్నపాటి ఇఫ్తార్విందుతోనే సరిపెడుతున్నారని మండిపడ్డారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల్లో భాగంగా కాంగ్రెస్ ప్రకటించిన తులం బంగారం ఎక్కడ? అంటూ సర్కారును నిలదీశారు. బస్తీల్లో ఉపవాసం ఉన్న ముస్లింలను పోలీసులు బారికేడ్లు పెట్టి, లైసెన్సుల పేరిట వేధిస్తున్నారని ఆరోపించారు.
గోదావరి, కృష్ణా నదుల్లో నీళ్లున్నా, నీటి వనరులు పుష్కలంగా ఉన్నా గ్రామాలు దాహర్తితో ఎందుకు తల్లడిల్లుతున్నాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో కనీసం రంజాన్ మాసంలోనైనా తాగునీటిని సక్రమంగా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం భూములను కాపాడాలని కోరారు. దళితబంధు ఎక్కడా? అంటూ అక్బరుద్దీన్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిరుడు దళితబంధు కింద రూపాయి ఖర్చుచేయలేదని, అంబేద్కర్ ఆభయహస్తం పథకాన్ని ప్రకటించినా పైసా ఇవ్వలేదని గుర్తుచేశారు. వీధి వ్యాపారులకు రక్షణ కరువైందని, సర్కారు తీరుతో 20 లక్షల మంది రోడ్డునపడ్డారని ఆందోళన వ్యక్తంచేశారు. రేషన్‌కార్డు లేకుండా రాజీవ్ యువవికాసం పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలని అక్బరుద్దీన్ ప్రశ్నించారు.