Michael | ప్రపంచ సంగీత చరిత్రలో తనకంటూ చెరగని ముద్ర వేసుకున్న ‘కింగ్ ఆఫ్ పాప్ మైఖేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ప్రతిష్ఠాత్మక బయోపిక్ ‘మైఖేల్’ (Michael) బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఈ చిత్రం ఏకంగా 1.01 బిలియన్ డాలర్లు (సుమారు రూ.8,700 కోట్లకు పైగా) వసూళ్లు సాధించి, ప్రపంచ సినీ చరిత్రలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన బయోపిక్‌గా కొత్త రికార్డు నెలకొల్పింది. ఈ చిత్రంలో మైఖేల్ జాక్సన్ పాత్రను ఆయన మేనల్లుడు జాఫర్ జాక్సన్ పోషించడం విశేషం. తన హావభావాలు, డ్యాన్స్ స్టైల్, వేదికపై ఎనర్జీతో జాఫర్ జాక్సన్ ప్రేక్షకులను పూర్తిగా మెప్పించాడు. తెరపై మైఖేల్ జాక్సన్‌ను మరోసారి సజీవంగా చూసిన అనుభూతిని అభిమానులకు అందించాడు.
హాలీవుడ్ దర్శకుడు ఆంటోయిన్ ఫుక్వా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మైఖేల్ జాక్సన్ బాల్యం నుంచి ప్రపంచ పాప్ సంగీత సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించుకున్నాడో అద్భుతంగా చూపించింది. ముఖ్యంగా ఆయన కుటుంబ సంగీత బృందం ‘జాక్సన్ 5’ రోజులు, అనంతరం సోలో ఆర్టిస్టుగా ఎదిగిన తీరు, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సంపాదించిన ప్రయాణం, ఆయన కెరీర్‌లోని ఎన్నో కీలక ఘట్టాలను భావోద్వేగంగా ఆవిష్కరించింది. సంగీత ప్రియులు మాత్రమే కాదు, సినీ అభిమానులను కూడా ఈ చిత్రం ఆకట్టుకుంది. మైఖేల్ జాక్సన్‌కు సంబంధించిన ఎన్నో అరుదైన సంఘటనలు, అద్భుతమైన సంగీత ప్రదర్శనలు, విజువల్ ట్రీట్‌గా నిలిచే సన్నివేశాలు ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
థియేటర్లలో ఈ సినిమాను చూడలేకపోయిన అభిమానులకు ఇప్పుడు గుడ్‌న్యూస్. ఆగస్టు 29 నుంచి ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం జియో హాట్‌స్టార్‌లోని పీకాక్ హబ్ ద్వారా స్ట్రీమింగ్కు అందుబాటులోకి రానుంది. ఇంగ్లీష్‌తో పాటు హిందీ ఆడియోల్లో కూడా ఈ సినిమా వీక్షించవచ్చు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రైమ్ వీడియోలో రెంట్ పద్ధతిలో అందుబాటులో ఉన్నప్పటికీ, జియో హాట్‌స్టార్ సబ్స్క్రైబర్లు ఎలాంటి అదనపు చార్జీలు లేకుండానే తమ సబ్‌స్క్రిప్షన్‌తో ఈ సినిమాను వీక్షించే అవకాశం పొందనున్నారు.మైఖేల్ జాక్సన్ సంగీతాన్ని ఇష్టపడే వారికి, ఆయన జీవితం గురించి తెలుసుకోవాలనుకునే వారికి ఈ బయోపిక్ తప్పక చూడాల్సిన చిత్రంగా సినీ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. థియేటర్లలో చరిత్ర సృష్టించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో కూడా అదే స్థాయిలో ఆదరణ పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన లెజెండరీ పాటలు, డ్యాన్స్ ప్రదర్శనలు, భావోద్వేగ కథనం ఈ సినిమాను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాయి.