Singeetham Srinivasa Rao | తెలుగు దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన “సింగ్ గీతం” (#SingGeetham) చిత్రంపై మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. సింగీతం గారు దర్శకుడిగా ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించడమే కాకుండా, ఎంతోమంది కళాకారులకు అవకాశాలు కల్పించి వారి జీవితాలకు మార్గదర్శకుడిగా నిలిచారని చిరంజీవి కొనియాడారు. అలాంటి గొప్ప వ్యక్తి దర్శకత్వంలో జూన్ 12వ తేదీన విడుదల కాబోతున్న ఈ చిత్రం ఇండియన్ సినిమాలో మరొక మైలురాయిగా నిలుస్తుందని, బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధించాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఇలాంటి సీనియర్ దర్శకులను గౌరవిస్తూ, వారి అపారమైన అనుభవాన్ని కొత్త తరానికి అందించాలనే అద్భుతమైన ఆలోచనతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ నిర్మాత నాగ్ అశ్విన్‌ను చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. ఒకవైపు నాటి తరానికి ప్రతినిధిగా నిలిచిన సింగీతం శ్రీనివాసరావు గారు, మరోవైపు నేటి తరం ఆలోచనలను ప్రతిబింబించే నాగ్ అశ్విన్.. వీరిద్దరి కలయిక ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందంటూ ప్రశంసించారు. అలాగే ఈ చిత్రానికి తనకు ఎంతో ఇష్టమైన రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (DSP) సంగీతం అందించడం సినిమాపై మరింత ఉత్సాహాన్ని, అంచనాలను పెంచిందని మెగాస్టార్ తెలిపారు. ఈ సందర్భంగా నిర్మాత నాగ్ అశ్విన్‌కు, స్వప్న సినిమాస్, వైజయంతీ ఫిలిమ్స్ బృందానికి, అలాగే చిత్రంలో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులందరికీ చిరంజీవి తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.