Mega Heroes | తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం మెగా హీరోల హవా కొనసాగుతోంది. వరుస విజయాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ మెగా ఫ్యామిలీ హీరోలు మరోసారి తమ స్టార్ పవర్‌ను నిరూపిస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, చిరంజీవి, రామ్ చరణ్ నటించిన తాజా చిత్రాలు భారీ వసూళ్లు నమోదు చేయడంతో మెగా అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. ఒక్కో హీరో ఒక్కో స్టైల్లో ప్రేక్షకులను అలరిస్తూ, రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. 2025లో విడుదలైన ఓజీ ద్వారా పవన్ కళ్యాణ్ అభిమానులకు సరికొత్త అనుభూతిని అందించారు. స్టైలిష్ యాక్షన్ అవతార్‌లో కనిపించిన పవన్, తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్, పవన్ లుక్, డైలాగ్స్ అభిమానుల్లో భారీ క్రేజ్‌ను తీసుకువచ్చాయి. విడుదల అనంతరం ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి పవన్ కెరీర్లో అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సంక్రాంతి బరిలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. 70 ఏళ్ల వయసులోనూ తన ఫిట్నెస్, ఎనర్జీ, కామెడీ టైమింగ్‌తో చిరంజీవి మరోసారి ప్రేక్షకులను మెప్పించారు. కొత్త లుక్‌తో తెరపై కనిపించిన ఆయనకు అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం కూడా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి సంక్రాంతి సీజన్లో భారీ విజయంగా నిలిచింది.
ఇక ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న చిత్రం పెద్ది. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామాలో రామ్ చరణ్ తన కెరీర్లోనే అత్యంత భావోద్వేగభరితమైన పాత్రల్లో ఒకటి పోషించారు. సినిమాలో చరణ్ నటన, పాత్ర కోసం చేసిన కష్టం ప్రేక్షకులను ఆకట్టుకుంది. భావోద్వేగ సన్నివేశాల్లో ఆయన ప్రదర్శనకు మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఇప్పటికే రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ చిత్రం, త్వరలోనే రూ.400 కోట్ల మార్క్‌ను అందుకునే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తంగా పవన్ కళ్యాణ్ ‘ఓజీ’, చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’, రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రాలు కలిసి రూ.900 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు నమోదు చేసినట్లు సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇటీవల కాలంలో టాలీవుడ్ ఎదుర్కొంటున్న సవాళ్ల మధ్య ఈ భారీ విజయాలు పరిశ్రమకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.