హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మెడికల్ పీజీ సీట్ల భర్తీలో ఎలాంటి అవకతవకలు జరగలేదని వైద్యశాఖ ఉన్నతాధికారులు స్పష్టంచేశారు. పలువురు ఆరోపిస్తున్నట్టు సీట్ల బ్లాకింగ్ జరగలేదని, ఒక్క సీటు కూడా అక్రమంగా మేనేజ్మెంట్ కోటాలో నింపలేదని తెలిపారు. డీఎంఈ రమేశ్‌రెడ్డి, కాళోజీ నారాయణరావు మెడికల్ వర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి, డీపీహెచ్ శ్రీనివాసరావు శుక్రవారం హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
సాధారణంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని సీట్లలో 50 శాతం కన్వీనర్ కోటా, 50 శాతం మేనేజ్మెంట్ కోటా ఉంటుందని తెలిపారు. మేనేజ్మెంట్ కోటాలోనూ 40 శాతం సీట్లను ప్రభుత్వమే మెరిట్ ప్రాతిపదిక నింపుతుందని, మిగతా 10 శాతం మాత్రమే మేనేజ్మెంట్ ఇష్టం వచ్చినవారికి ఇచ్చే అవకాశం ఉంటుందని అన్నారు. మేనేజ్మెంట్ కోటా కోసం దేశంలోని ఏ రాష్ర్టానికి చెందినవారైనా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.
40 శాతం మేనేజ్మెంట్ సీట్లకు రెండో కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత ఇతర రాష్ర్టాలకు చెందిన 14 మంది అనుమానాస్పదంగా కనిపించారని పేర్కొన్నారు. వీరికి ఎక్కువ ర్యాంకు వచ్చినా, వారి సొంత రాష్ట్రంలో ప్రభుత్వ కోటాలో సీటు వచ్చే అవకాశం ఉన్నా.. ఇక్కడికి వచ్చి మేనేజ్మెంట్ కోటాలో చేరినట్టు గుర్తించామని అన్నారు. దీంతో వారి ఆధార్ కార్డుపై ఉన్న అడ్రస్‌కు మార్చి 16న లేఖలు పంపి, వివరణ కోరామని తెలిపారు. 14 మందిలో 10 మంది మాత్రమే చేరారని పేర్కొన్నారు. ఈ 10 మందిని ఒకటికి రెండుసార్లు సంప్రదించి సీట్ బ్లాకింగ్ గురించి హెచ్చరించామని చెప్పారు.
ఈ పరిణామం తర్వాత కేంద్రం కటాఫ్ స్కోర్‌ను తగ్గించిందని, దీని ప్రకారం మరోసారి రిజిస్ట్రేషన్లకు పిలిచామని చెప్పారు. ఇంతకు ముందు మిగిలిపోయిన 4 సీట్లను కూడా ఇందులో కలిపినట్టు చెప్పారు. ఈసారి వచ్చిన దరఖాస్తుల్లో 20 మంది ఇతర రాష్ర్టాల వారు అనుమానాస్పదంగా ఉన్నట్టు గుర్తించామన్నారు. వీరిని వివరణ కోరామని తెలిపారు. దీంతో ఇందులో నలుగురు మాత్రమే కాలేజీలో చేరారని అన్నారు. మిగతా 16 మందిలో ఐదుగురు ‘మేము అసలు దరఖాస్తు చేయలేదు.
మా పేరు, సర్టిఫికెట్లతో వేరే ఎవరో దరఖాస్తు చేసినట్టున్నారు’ అని సమాధానం ఇచ్చారన్నారు. ఈ అంశాన్ని వైద్యారోగ్యశాఖ మంత్రి హారీశ్‌రావు తీవ్రంగా పరిగణించారని తెలిపారు. మంత్రి ఆదేశాల మేరకు వరంగల్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. ఈ దఫా మిగిలిపోయిన 16 సీట్లను ప్రస్తుతం నోటిఫై చేశామన్నారు.
రిజిస్ట్రేషన్ల గడువు పూర్తయిన తర్వాత కొందరు అభ్యర్థులు కోర్టుకు వెళ్లి వివిధ కారణాలు వివరించి, తర్వాతి కౌన్సెలింగ్‌లో చేర్చుకొనేలా ఉత్వర్వులు తీసుకొచ్చారని తెలిపారు. ఇలా వచ్చినవారిలో ముగ్గురు అనుమానాస్పదంగా కనిపించడంతో రిజిస్ట్రేషన్ చేయలేదని చెప్పారు. వారిని సంప్రదించగా ఇద్దరు ‘మేము దరఖాస్తే చేయలేదు’ అని సమాధానం ఇచ్చారన్నారు.
వాస్తవానికి సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మేనేజ్మెంట్ కోటా తర్వాత రెండు రౌండ్ల కౌన్సెలింగ్, మాపప్ కౌన్సెలింగ్ తర్వాత మిగిలిపోయిన సీట్లను మేనేజ్‌మెంట్‌కే వదిలేయాల్సి ఉంటుందని చెప్పారు. అనుమానాస్పద పరిణామాల నేపథ్యంలో అక్రమాలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం మిగిలిపోయిన సీట్లకు మరోసారి కౌన్సెలింగ్ చేసేందుకు అవకాశం ఇచ్చిందని వివరించారు. దీంతో ఖాళీగా ఉన్న మొత్తం 58 సీట్లను గుర్తించి, నోటిఫై చేశామన్నారు. కటాఫ్ తగ్గించిన తర్వాత చేసిన కౌన్సెలింగ్‌లో ఇతర రాష్ర్టాలవారు చేరని 16 సీట్లను కూడా ఇందులో కలిపామని, త్వరలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని చెప్పారు.
90 శాతం సీట్లకు ప్రభుత్వ కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత మాత్రమే మిగతా 10 శాతం సీట్లను మేనేజ్మెంట్ భర్తీ చేసుకొనేందుకు అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ప్రభుత్వ కౌన్సెలింగ్ పూర్తి కాలేదు కాబట్టి మేనేజ్మెంట్ భర్తీ ప్రక్రియ ప్రారంభం కాలేదని, ఒక్క సీటు కూడా అక్రమంగా భర్తీ చేసే అవకాశమే లేదని వివరించారు. ఇప్పటివరకు ఉన్న ఖాళీలను నోటిఫై చేశామని, రాష్ట్రంలో ఇప్పటివరకు సీట్ బ్లాకింగ్ జరగలేదని స్పష్టంచేశారు. ఎక్కువ ర్యాంకు వచ్చి ఇక్కడ చేరిన ఇతర రాష్ర్టాలవారు చివరి నిమిషంలో తప్పుకోవాలని ప్రయత్నిస్తే వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకొంటారని హెచ్చరించారు.
ఆలిండియా కోటా, రాష్ర్టాల కోటా, మేనేజ్మెంట్ కోటాకు ఒకేసారి కౌన్సెలింగ్ నిర్వహిస్తుండటంతో గందరగోళం నెలకొన్నదని అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ, ఏపీల్లో కౌన్సెలింగ్ పూ ర్తయిన వెంటనే మెరిట్ లిస్ట్‌ను, అలాట్మెంట్ లిస్ట్‌ను వెబ్సైట్లో పెడుతున్నామని, చాలా రాష్ర్టాల్లో ఈ వ్యవస్థ లేదని చెప్పారు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ చేరుతున్నవారికి వారి సొంత రాష్ట్రంలో సీటు వచ్చిందో లేదో తెలుసుకొనేందుకు అవకాశం ఉండటం లేదని తెలిపారు. దీనిని అధిగమించేందుకు దేశవ్యాప్తంగా ఒకే పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తే బాగుంటుందని, లేదా కామన్ కౌన్సెలింగ్ విధానాన్ని అమలు చేయాలని సూచించారు.
పోలీసులకు కాళోజీ హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్ ఫిర్యాదు
పీజీ సీట్ల కౌన్సెలింగ్‌లో నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చి పీజీ సీట్లను బ్లాక్ చేయాలని యత్నించిన నిందితులపై చర్యలు తీసుకోవాలని కాళోజీ హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ప్రవీణ్‌కుమార్ స్థానిక మట్టెవాడ పోలీసులకు గురువారం రాత్రి ఫిర్యాదు చేశారు. యూనివర్సిటీ ఆధ్వర్యంలో నీట్లో అర్హత సాధించిన అభ్యర్థులకు నిర్వహించిన పీజీ సీట్ల కౌన్సెలింగ్‌లో కొందరు వ్యక్తులు, సంస్థలు ఇతరుల సర్టిఫికెట్స్ నకలు కాపీలను వినియోగించి దరఖాస్తు చేసుకున్నట్టు గుర్తించామని రిజిస్ట్రార్ తెలిపారు. నకిలీ ధ్రువపత్రాలను అందించి యూనివర్సిటీని మోసం చేయడానికి యత్నించిన ఘటనపై సెక్షన్ 417, 420 ప్రకారం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్టు మట్టెవాడ సీఐ సీహెచ్ రమేశ్ తెలిపారు. త్వరలో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకుంటామని పేర్కొన్నారు.