చాంద్రాయణగుట్ట: దేశంలో బాగా ప్రాచుర్యం పొందిన మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ‘మ్యాట్రిక్స్ ఫైట్ నైట్(ఎమ్‌ఎఫ్‌ఎన్)’ పోటీలకు హైదరాబాద్ వేదిక అయ్యింది. అంతర్జాతీయ సూపర్ ఫైటర్లతో పాటు పలువురు దేశవాళీ స్టార్లు పోటీపడ్డ ఎమ్‌ఎఫ్‌ఎన్ ఏడో సీజన్ పోరుకు హైదరాబాద్ తొలిసారి ఆతిథ్యమిచ్చింది. తాజ్ ఫలక్‌నుమాలో తారల వెలుగు జిలుగుల మధ్య రవసత్తరంగా సాగిన ఎమ్‌ఎఫ్‌ఎన్ పోటీలు అభిమానులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా అఫ్గనిస్థాన్ లయన్గా పేరొందిన అబ్దుల్ అజీమ్ ఫైట్ హైలెట్‌గా నిలిచింది.
మెయిన్కార్డ్లో భాగంగా జరిగిన బౌట్లో అబ్దుల్..బ్రెజిల్‌కు చెందిన మార్సెలో గురిల్హాను చిత్తుగా ఓడించాడు. అబ్దుల్ విసిరిన పవర్ఫుల్ పంచ్‌లకు మార్సెలో నుంచి సమాధానం లేకపోయింది. రెండో రౌండ్లో ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు పంచ్‌లతో విరుచుకుపడ్డారు. అబ్దుల్ విసిరిన పంచ్‌లకు తట్టుకోలేకపోయిన మార్సెలో కింద పడిపోవడంతో రిఫరీ అతన్ని విజేతగా ప్రకటించాడు. మిగతా బౌట్లలో సుమిత్ ఖడేపై ధృవ్ చౌదరీ, అభిషేక్ నెగీపై శ్యామానంద్ విజయాలు సాధించారు. మొత్తం తొమ్మిది బౌట్లు నిర్వహించారు. జాతీయ మిక్స్డ్ మార్షల్ అర్ట్స్ ఆధ్వర్యంలోజరిగిన ఈ బౌట్‌కు ప్రముఖ బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ చెల్లెలు కృష్ణష్రాఫ్, సారా టెండూల్కర్ తదితరులు హాజరయ్యారు.