ప్రభుత్వం భారీ దోపిడీకి స్కెచ్ వేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఏడు చోట్ల వంతెనలు, అండర్ పాస్‌ల నిర్మాణానికి అంచనా వేసిన మొత్తం వ్యయాన్ని రూ. 1,090 కోట్లుగా ఖరారు చేశారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు పనులన్నీ రద్దు చేసి, పంజాగుట్ట నాగార్జున సరిల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వరకు చేపడుతున్న 6-లేన్ల సింగిల్ ఎలివేటెడ్ కారిడార్‌కు కూడా రూ. 1090 కోట్లు అని చూపడం వెనుక లోగుట్టు ఏమిటనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాత నిధుల అంచనాలనే కొత్త ప్రాజెక్టుపై నెట్టేసి లెకలను దాచిపెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సిటీబ్యూరో, అక్టోబరు 6 (నమస్తే తెలంగాణ)/బంజారాహిల్స్ : కేబీఆర్ పార్కు చుట్టూ ఐదు కిలోమీటర్ల మేర ఏడు ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణానికి తొలి ప్రతిపాదనలు ఖర్చుగా చేశామని ఇందులో అండర్‌పాస్‌ల స్థలాన్ని మినహాయిస్తే ఫ్లై ఓవర్ దాదాపుగా 4 కిలోమీటర్లుగా అంచనా వేసి.. రెండో ప్యాకేజీలో కొత్త ఎలివేటెడ్‌లో చేర్చి సంబంధిత నాలుగు కిలోమీటర్ల ఖర్చును ఇక్కడ సర్దుబాటు చేసినట్లుగా అధికారులు చెబుతున్నారు. పాత పనులకు సంబంధించిన కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ కాంట్రాక్టు ఒప్పందాలను రద్దు చేశామని చెబుతున్న అధికారులు నూతన ఎలివేటెడ్ కారిడార్ పనులను మాత్రం ఏ విధమైన కొత్త టెండర్లు పిలవకుండానే ప్యాకేజీ -1లో పనిచేస్తున్న మేఘా వంటి బడా సంస్థకే అప్పగిస్తూ నిర్ణయం తీసుకోవడం అనేక అనుమానాలు తావిస్తోంది.
ఒకే ఎలివేటెడ్ కారిడార్ కాబట్టి ఒకే కంపెనీకి ఇచ్చినట్లుగా అధికారులు పేర్కొంటున్నారు. అప్పటికే సదరు కంపెనీ పనులు చేపట్టిందని వెనుకేసుకుని రావడం గమనార్హం. ఇక అగ్రసేన్, క్యాన్సర్ దవాఖాన జంక్షన్ల వద్ద అండర్‌పాస్‌ల నిర్మాణానికి భారీ గుంతలు తవ్విన అధికారులు..ఇందుకోసం చేసిన ఖర్చుపై నోరు విప్పడం లేదు..పైగా కేబీఆర్ పార్కు చుట్టూ వన్ వే విధానం శాశ్వతంగా అమలు చేస్తున్నప్పుడు ఐ ల్యాండ్ ఉండవద్దని, జంక్షన్లలో చేసిన గుంతల ఖర్చు పెద్దగా నష్టం లేదని పేర్కొంటున్నారు. గత డిజైన్ ప్రకారం చేపట్టిన పనుల్లో భాగంగా రోడ్ల వెంట తవ్విన భారీ గుంతలు, చెట్ల నరికివేత ప్రక్రియ ద్వారా వృథా అయిన మిగతా రూ. 300 కోట్లకు పైగా బడ్జెట్ పై అధికారులు పెదవి విప్పకపోవడం గమనార్హం. గతంలో చేసిన పనుల వ్యర్థాలు, కూల్చివేతలు, డిజైనింగ్ వ్యయం వల్ల పోయిన ప్రజాధనాన్ని ఎవరి ఖాతాలో వేస్తారో జీహెచ్ ఎంసీ సమాధానం చెప్పడం లేదు. ఒకవైపు అధికారులు రూ. 1,200 కోట్ల ప్రజాధనం ఆదా అవుతుందని మీడియా ప్రకటనలు చేస్తున్నప్పటికీ, ఆచరణలో మాత్రం టెండర్ల లేమి, ఖర్చుల అస్పష్టత, కాంట్రాక్టర్ల అనుకూల నిర్ణయాలు అనేక ప్రశ్నలను మిగులుస్తున్నాయి.
ఇదిలా ఉండగా ఆరు నెలల క్రితం ప్రారంభించిన హెచ్సిటీ ప్రాజెక్టులో భాగంగా ఏడు ఫ్లైఓవర్లు.. ఏడు అండర్‌పాస్‌లకు సంబంధించిన అంచనా వ్యయం రూ.1090కోట్లు అంటూ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. మొదటి ప్యాకేజీలో భాగంగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి ముగ్దా జంక్షన్ దాకా ఫ్లైఓవర్, చెక్‌పోస్ట్ నుంచి కేబీఆర్ పార్కు మెయిన్ గేటు ముందు నుంచి క్యాన్సర్ ఆస్పత్రి వైపు అండర్‌పాస్, పంజాగుట్ట వైపునుంచి జూబ్లీహిల్స్ వైపు 900 మీటర్ల మేర మూడు లేన్ల ఫ్లైఓవర్ , ఎల్వీ ప్రసాద్ వైపునుంచి పంజాగుట్ట వెళ్లే దారిలో ముగ్దా జంక్షన్ వద్ద 260 మీటర్ల మూడులేన్ల అండర్‌పాస్ నిర్మాణాలు చేస్తామని గతంలో ప్రకటించారు. వీటితో పాటు జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద 740 మీటర్ల వై షేప్ అండర్‌పాస్, 745 మీటర్ల నాలుగు లేన్ల ఫ్లైఓవర్, 770 మీటర్ల రెండు లేన్ల సెకండ్ లెవల్ ఫ్లైఓవర్‌ను నిర్మిస్తామని, వీటి నిర్మాణంతో జూబ్లీహిల్స్ రోడ్ నెం 45 వైపు నుంచి చెక్‌పోస్ట్, యూసుఫ్‌గూడ, కేబీఆర్ పార్కు వైపు వెళ్లే ట్రాఫిక్ సాఫీగా సాగుతుందని పేర్కొన్నారు.
రెండో ప్యాకేజీలో భాగంగా జూబ్లీహిల్స్ రోడ్ నెం 45 జంక్షన్ వద్ద 290 మీటర్ల అండర్‌పాస్, 500మీటర్ల ఫ్లైఓవర్‌ను నిర్మిస్తున్నామని, ఫిలింనగర్‌లోని బీవీబీ జంక్షన్ వద్ద 600మీటర్ల ఫ్లైఓవర్, బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని అగ్రసేన్ చౌరస్తాలో 410 మీటర్ల అండర్‌పాస్, 590మీటర్ల ఫ్లైఓవర్, క్యాన్సర్ ఆస్పత్రి జంక్షన్లో 330 మీటర్ల అండర్‌పాస్, 540 మీటర్ల ఫ్లైఓవర్ నిర్మిస్తున్నామని పేర్కొన్న ప్రభుత్వ పెద్దలు, అధికారులు ఏకపక్షంగా వీటన్నింటిని రద్దు చేసి కేవలం నాగార్జున సర్కిల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ దాకా రెండు ప్యాకేజీలుగా 4.3 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తున్నామని తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే గతంలోని డిజైన్లకు, ప్రస్తుతం మార్చిన ప్రాజెక్టు డిజైన్‌కు అయ్యే ఖర్చు మాత్రం రూ.1090 కోట్లుగా పేర్కొనడంతో ఈ మొత్తం వ్యవహారంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. గతంలో ఆమోదించిన ప్రాజెక్టులో నిర్మించతలపెట్టిన అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్లకు, తాజాగా నిర్మించనున్నట్లు ప్రకటించిన ఎలివేటెడ్ కారిడార్‌కు ఏ మాత్రం పొంతన లేకున్నా నిర్మాణ వ్యయం మాత్రం ఒకేలా పేర్కొనడంపై ఇంజినీరింగ్ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటివరకు చేపట్టిన పనులకు, మార్చిన ప్రాజెక్టుకు ఏమాత్రం సంబంధం లేదని, పిల్లర్లతో పాటు అన్ని అంశాలు పూర్తిగా మా ర్చాల్సి ఉంటుందని, మూడు లేన్ల ఫ్లైఓవర్ల కోసం వేస్తున్న పిల్లర్లను అరు లేన్ల స్టీల్ బ్రిడ్జి కోసం వినియోగించేందుకు ఏ మాత్రం అవకాశం లేదని వారు అభిప్రాయపడుతున్నారు.ప్రాజెక్టు స్వరూపమే పూర్తిగా మారుతుందని, డిజైన్లతో సహా అన్ని అంశాలను తిరిగి సున్నా నుంచి ప్రారంభించాల్సి ఉంటుందని, ప్రత్యేకంగా టెండర్లు పిలవాల్సి ఉంటుందని వారు పేర్కొంటున్నారు. ఇన్ని రకాలైన సమస్యలు ఉన్న తరుణంలో మారిన డిజైన్ వల్ల రూ.800కోట్లు పొదుపు చేస్తున్నామని అధికారపార్టీ నేతలు చెప్పుకోవడం వారి అవగాహన లేమికి నిదర్శనంగా నిలుస్తోందని చర్చ లేకపోలేదు.