మహదేవపూర్, జూన్ 18: దక్షిణ కాశీగా పేరుగాంచిన కాళేశ్వర క్షేత్రాన్ని ఏటీఎంగా మార్చుకున్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కుటుంబం ఆలయ పునర్నిర్మాణం పేరుతో రూ.100 కోట్లు దోచుకునేందుకు కుట్రలు చేస్తున్నదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ధ్వజమెత్తారు. గురువారం ఆయన బీఆర్ఎస్ రాష్ట్ర మాజీ యువజన నాయకుడు జక్కు రాకేశ్, స్థానిక నాయకులతో కలిసి కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయ పరిసరాలను పరిశీలించారు. చిరు వ్యాపారులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంత రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే కాళేశ్వరాన్ని మంత్రి శ్రీధర్‌బాబు ఏటీఎంగా మార్చుకున్నారని తాము చెప్పామని, దానిని బలపర్చే విధంగా అభివృద్ధి పేరుతో దుద్దిళ్ల కుటుంబం వంద కోట్లు జేబులో వేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నదన్నారు. శ్రీధర్‌బాబు ఇకడ జన్మించకపోవడం, ఆయనకు సంబంధించిన వాళ్లు ఎవరూ లేకపోవడం, ఈ ప్రాం త స్థితిగతులు తెలియకపోవడంతోనే కాళేశ్వర ఆలయాన్ని ధ్వంసం చేస్తూ వంద కోట్లను దోచుకునే ప్రయత్నం కళ్ల ముందే కన్పిస్తున్నదన్నారు. వీరి కుట్రలను వ్యతిరేకించే బాధ్యత నియోజకవర్గ ప్రజలు, మండల ప్రజలతో పాటు ఆలయాన్ని నమ్ముకుని బతికే బ్రాహ్మణులపై ఉందన్నారు. ఇకడ జరిగే ఈ వ్యవహారాన్ని రాష్ట్రంలోని బ్రాహ్మణ పురోహితులు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు.
వచ్చే ఏడాది గోదావరి నది పుషరాలు ఉన్నాయని, తెలంగాణ ప్రసిద్ధి గాంచిన ఆలయాల్లో మాత్రమే పుషరాలు జరుగుతాయని, అందులో కాలేశ్వర క్షేత్రం ఒకటని ఆయన తెలిపారు. ఈ పుషరాలకు దేశనలుమూలల నుంచి భక్తులు లక్షలాదిగా తరలివచ్చి పుషరస్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకుంటారని పేర్కొన్నారు. ఈ క్రమంలో తమ జేబులు నింపుకోవడానికి అభివృద్ధి పేర ఆలయాన్ని కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఇకడ అనేక మంది మాజీ ఎమ్మెల్యేలు, మాజీ జడ్పీ అధ్యక్షులు, అనుభవజ్ఞలు, మేధావులు, ఆలయాన్ని బాగు చేసిన వాళ్లున్నా కూడా ఎవరినీ పిలువకుండా దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ ఓ అధికారిని పంపించి తూతూ మంత్రంగా సమావేశం నిర్వహించి రూ.198 కోట్ల టెండర్ పిలిచారని మధూకర్ తెలిపారు.
అంటే దాదాపు వంద కోట్ల మింగడానికే పునర్నిర్మాణ కార్యక్రమం చేపట్టారని అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వం వద్ద నయాపైసా లేదని, మేము ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకుపోయే వాళ్లుగా చూస్తున్నారని బహిరంగాగానే చెప్తున్నారని, ఈ క్రమంలో ఎలా పైసలు తీసుకొస్తారని ఆయన ప్రశ్నించారు. దుద్దిళ్ల స్వగ్రామమైన ధన్వాడ వద్ద రోడ్డు బాగా లేదని చెప్పి నెల రోజులు గడుస్తున్నా పైసలు లేక రోడ్డు బాగు చేయలేదన్నారు. పెద్దపల్లి-కాటారం రోడ్డుకు రూ.300 కోట్లు తీసుకొస్తే ఇప్పటి వరకు ఆ రోడ్డును పూర్తి చేయలేకపోయిన దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కాళేశ్వర ఆలయాన్ని ఎలా అభివృద్ధి చేస్తారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఆలయాన్ని కూల్చే ముందు విధి విధానాలను చెప్పాలని, అంతకంటే ముందు భూపాలపల్లి కలెక్టర్ ఖాతాలో రూ.100 కోట్లు జమ చేసిన తర్వాతనే తాము నమ్ముతామన్నారు.
ఆలయాన్ని కూలగొట్టిన తర్వాత పైసలు లేక ఆగిపోతే భక్తులు ఇబ్బందులు పడతారని తెలిపారు. ఒకప్పుడు ఇకడ జరిగిన తవ్వకాల్లో పురాతన త్రిశూలాలు, లింగం, గుప్తనిధులు బయటపడ్డట్లు చెప్తున్నారని, వాటి కోసమే తొందరపడి పనులు చేస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు తీసుకుని తప్పుకునే అవకాశం ఉందన్నారు. కలెక్టర్ అకౌంట్ లో డబ్బులు వేయకుంటే కూల్చివేతలను తాము అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మంథని నియోజకవర్గ మాజీ మహిళా అధ్యక్షురాలు కేదారి గీత, మహదేవపూర్ మాజీ సర్పంచ్ శ్రీపతిబాపు, బీఆర్ఎస్ మండల మాజీ యూత్ అధ్యక్షుడు ఎండీ అలీంఖాన్, మండల మాజీ ప్రధాన కార్యదర్శి గోల్కొండ కిరణ్, నాయకులు అన్కారీ ప్రకాశ్, బాపురావు, శ్రీనివాస్‌రావు, సుంకె మధు, రాజేందర్, దేవరనేని కల్యాణ్‌రావు, కాళేశ్వరం మాజీ ఉప సర్పంచ్ పవన్‌శర్మ, రాజు పాల్గొన్నారు.