న్యూఢిల్లీ, జూన్ 18 : దేశవ్యాప్తంగా గ్రామాల్లోని ప్రతి రహదారికి ఒక ప్రత్యేక కోడ్, డిజిటల్ గుర్తింపు, ప్రామాణిక వర్గీకరణను కేటాయించే వ్యవస్థను కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వశాఖ ప్రతిపాదించింది. గ్రామీణ మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే లక్ష్యంతో ఈ వ్యవస్థను ప్రతిపాదించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని అంతర్గత గ్రామ రహదారులకు నామకరణం, కోడింగ్, డిజిటల్ మ్యాపింగ్ కోసం కోడింగ్ వ్యవస్థను రూపొందించినట్లు వర్గాలు పేర్కొన్నాయి.
గ్రామాల్లోని రోడ్లు, వీధులు చాలా వరకు నమోదు కాకుండానే ఉండిపోయాయి. అంబులెన్సులు, తపాలా సేవలు, ప్రభుత్వ సంస్థలు, నావిగేషన్ ప్లాట్‌ఫామ్‌లకు ఇబ్బందులను సృష్టిస్తున్నది. కోడింగ్ తో గ్రామాల్లోని రోడ్లను మెయిన్ రోడ్లు, క్రాస్ రోడ్లు, ఇతర లేదా కనెక్టెడ్ రోడ్లు పేరిట మూడు తరగతులుగా వర్గీకరిస్తారు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ప్రతి రహదారి ఇక దాని స్థానానికి కోడ్ కేటాయిస్తారని వర్గాలు తెలిపాయి.