ఛత్రపతి శంభాజీ నగర్: 58 లక్షల కున్బీ రికార్డుల ఆధారంగా కుల ధ్రువీకరణ పత్రాలను వెంటనే జారీ చేయాలని మరాఠా రిజర్వేషన్ల ఉద్యమకారుడు మనోజ్ జరాంగే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయమై శనివారం ఆయన నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన అంతర్వాలీ సరాతీ గ్రామంలో మీడియాతో మాట్లాడుతూ ఇది తన తుది పోరాటమని హెచ్చరించారు.
సీఎం ఫడ్నవీస్ మరాఠా వర్గంపై కక్ష పెంచుకొన్నారని.. డిప్యూటీ సీఎం షిండే ఆయనకు మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. కుల ధృవీకరణ కమిటీని రద్దు చేయకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తానని హెచ్చరించారు. ఇతర వెనుకబడిన తరగతి(ఓబీసీ) వర్గం కింద విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ ప్రయోజనాలు పొందే వ్యవసాయ వర్గమైన కున్బీలుగా అర్హులైన మరాఠాలను గుర్తించాలని జరాంగే ఇప్పటికే అనేక ఆందోళనలకు నాయకత్వం వహించారు.