భూపాలపల్లి రూరల్, జనవరి 11 : మావోయిస్టు నేత మచ్చ సోమయ్య (సమ్మయ్య) జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో లొంగిపోయినట్టు ఎస్పీ కిరణ్ ఖరే తెలిపారు. శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. భూపాలపల్లి మండలం, పంబాపూర్ గ్రామానికి చెందిన మచ్చ సోమయ్య 32 సంవత్సరాలుగా మావోయిస్టు జిల్లా కమిటీ సెక్రటరీగా పని చేస్తున్నాడు. 1998లో గండి కామారం, 2002లో సింగారం – పందిపంపుల, 2018 లో దూలేడు, 2024లో పాలగూడెంలో జరిగిన హింసాత్మక ఘటనల్లో పాల్గొన్నాడు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో పలు కేసులు నమోదయ్యాయి. రూ.8లక్షల రివార్డు ఉంద ని, అతడికి అందజేయనున్నట్టు తెలిపారు. సీపీఐ (మావోయిస్ట్) సంస్థలో కొనసాగడానికి మచ్చ సోమయ్య ఆరోగ్యం సహకరించకపోవడం, వృద్ధాప్యం కారణంగా లొంగిపోవడానికి ఎర్రాల్ ఇన్చార్జిని అనుమతి కోరగా, ఆ ప్రతిపాదనను కేంద్ర కమిటీకి పంపగా అనుకూలంగా స్పందించారని తెలిపారు.