
వికలాంగులు ఎదురైతే జాలి చూపుతాం. మానసిక వికలాంగులు కనిపిస్తే సానుభూతిని ప్రదర్శిస్తాం. కానీ, మన జాలి ఆకలి తీర్చదు. మన సానుభూతి భరోసా ఇవ్వలేదు. ఆ జీవితాలకు కావాల్సింది.. ఆసరా! అందుకే, ఆంత్రప్రెన్యూర్ సింధు శ్రీరామ్ సేవకు ఉపాధిని జోడించింది. సృజనాత్మక వ్యాపారంలో వారినీ భాగస్వాములను చేసింది. ‘మనోవాంఛ’ ఆమె కలల పంట!
అందమైన బొకేలు, ఆకట్టుకునే ఫ్లవర్‌వాజ్‌లు, సృజనాత్మక ఆహ్వాన పత్రికలు, వింతవింత బహుమతులు.. చూస్తూ చూస్తూ కండ్లు తిప్పుకోలేం! వాటికి ప్రాణం పోసినవారిని మెచ్చుకోకుండా ఉండలేం. ఆ అద్భుతాల ఆవిష్కరణలో దివ్యాంగులు, విభిన్న ప్రతిభావంతుల పాత్రా ఉంది. ఆంత్రప్రెన్యూర్ సింధు శ్రీరామ్ ఆకాంక్షలకు అందమైన రూపమే.. ‘మనోవాంఛ’ స్వచ్ఛంద సంస్థ.
దివ్యాంగులకు ఉపాధి
‘సింధూ! మనం మంచి చేస్తే. మనకూ మంచే జరుగుతుంది. ఏ దిక్కూ లేనివారికి చేతనైన సాయం అందించు’ అంటూ భర్త చేసిన కర్తవ్యబోధ ఆ ఇల్లాలిని అపారంగా ప్రభావితం చేసింది. 2017లో ‘మనోవాంఛ’ అనే స్వచ్ఛంద సంస్థకు ప్రాణం పోయించింది. సింధు స్వతహాగా సృజనశీలి. ఫైన్ ఆర్ట్స్ పట్టభద్రురాలు కూడా కావడంతో కళల మీద పట్టు వచ్చింది. దీంతో, బహుమతుల తయారీపై దృష్టిసారించింది. వివిధ ఎన్జీవోలకు వెళ్లింది. పలు ఆశ్రమాలను సందర్శించింది. దివ్యాంగులనూ, విభిన్న ప్రతిభావంతులనూ ఎంచుకొంది. బహుమతుల తయారీలో వారికి శిక్షణ ఇచ్చింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి తానే క్యాబ్ బుక్ చేసి, పని నేర్పించి, ఆ పూటకు భోజనం పెట్టి, మళ్లీ క్యాబ్‌లో సురక్షితంగా ఇంటికి పంపుతుంది. ఆ కళాత్మక వస్తువుల విక్రయం ద్వారా వచ్చిన లాభంలో 25 నుంచి 30 శాతం వరకూ వారికే ఇస్తుంది.
‘ఆర్గానిక్’ బహుమతులు
కానుకలను ఆర్థిక కోణంలో చూడలేం. వాటి విలువా అపారమైందే. బహుమతులను ఇవ్వడంలో తృప్తి ఉంటుంది, పుచ్చుకోవడంలో ఆనందం ఉంటుంది. కలకాలం గుర్తుండిపోయే కానుక ఇచ్చినప్పుడు, అందుకున్నవారి కండ్లలోని వెలుగుల ముందు వెన్నెల కాంతులూ చిన్నబోవాల్సిందే. అందుకే, ‘మనోవాంఛ’ ప్రతి బహుమతినీ వినూత్నంగా తయారు చేస్తుంది. రసాయన మిశ్రమాలను, కృత్రిమ రంగులను జోడించరు. ‘క్రియేటివ్‌గా ఆలోచిస్తేనే కదా! మార్కెట్లో డిమాండ్ పెరిగేది. నలుగురికీ ఉపాధి కల్పించగలిగేది’ అంటున్నది ఆంత్రప్రెన్యూర్ సింధు శ్రీరామ్.
… డప్పు రవి