Rakasa 2 | చిన్న సినిమాగా విడుదలైన ‘రాకాస’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. హారర్ కామెడీ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా అలరించడంతో పాటు కలెక్షన్ల పరంగానూ సత్తా చాటింది. ఈ విజయంతో ‘రాకాస 2’పై ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. రీసెంట్గా జరిగిన సక్సెస్ సెలబ్రేషన్స్‌లో దర్శకురాలు మానస శర్మ సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చారు.
“రాకాస 2 కచ్చితంగా ఉంటుంది. స్టోరీ స్ట్రక్చర్ సిద్ధంగా ఉంది. కానీ ఇంకా దాన్ని మరింత డెవలప్ చేయాలి” అని ఆమె తెలిపారు. ఈ వ్యాఖ్యలతో సీక్వెల్‌పై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది.
మొదటి భాగంలో హీరోగా నటించిన సంగీత్ శోభన్ ‘రాకాస 2’లో కూడా కొనసాగుతాడా? అనే ప్రశ్నకు మానస శర్మ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. “అది కాలమే నిర్ణయిస్తుంది” అంటూ క్లియర్‌గా చెప్పకుండా తప్పించుకోవడంతో, ఈ విషయంపై మరింత సస్పెన్స్ నెలకొంది. ఆమె సమాధానం విని పక్కనే ఉన్న నిర్మాత నిహారిక కొణిదెల, హీరో సంగీత్ శోభన్ కూడా ఆశ్చర్యపోయారు. చందమామ కథ తరహాలో ఉన్న ఒక ఫాంటసీ అంశాన్ని నేటి తరానికి తగ్గట్లుగా హారర్, కామెడీ ఎలిమెంట్స్‌తో మిళితం చేసి మానస శర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో సంగీత్ శోభన్, నయన్ సారిక హీరో హీరోయిన్లుగా నటించారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్ బ్యానర్లపై ఈ సినిమా నిర్మితమైంది.
ఏప్రిల్ 3న విడుదలైన ‘రాకాస’ చిత్రం అద్భుతమైన స్పందనతో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. సుమారు రూ.15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే రూ.19 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు సమాచారం. ముఖ్యంగా గెటప్ శ్రీను, వెన్నెల కిశోర్‌ల కామెడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఓ గ్రామంలో ఉన్న కోటలో బ్రహ్మరాక్షసుడు నివసిస్తాడు. అతను బలి కోరినప్పుడల్లా గ్రామం నుంచి ఒకరిని పంపాలి. ఒక సందర్భంలో హీరో తన స్నేహితుడి కోసం కోటలోకి వెళ్లడం, అక్కడ జరిగే సంఘటనలు కథలో ప్రధానాంశం. హారర్, కామెడీ మేళవింపుతో ఈ కథ ప్రేక్షకులను కట్టిపడేసింది. ‘రాకాస’ సక్సెస్‌తో ‘రాకాస 2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కథను ఇంకా బలోపేతం చేసి, మరింత గ్రాండియర్‌గా సీక్వెల్‌ను తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.