You tube| సామాజిక మాధ్యమాలు ఈ రోజుల్లో మనుషుల జీవితంపై చాలా ప్రభావం చూపిస్తున్నాయి. మనకు తెలియని ఎన్నో వింతలు, విషయాలు, విశేషాలను కూడా సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకోగలుగుతున్నాం. మనకు ఏదైన అనుమానం వచ్చినప్పుడు వెంటనే యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా తెరిచి అనేక విషయాలను నేర్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి యూట్యూబ్ చూసి తనకు తానే ఆపరేషన్ చేసుకున్నాడు. ఈ వార్త తెలిసిన నెటిజన్లు నోరెళ్లపెడుతున్నారు. వివరాలలోకి వెళితే తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్న ఓ వ్యక్తి యూట్యూబ్లో వీడియోలు చూసి తనకు తానే ఆపరేషన్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
తన పొట్టను కోసి సర్జరీ చేసేందుకు ప్రయత్నించగా విఫలమై తీవ్ర రక్తస్రావమైంది. అతడిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్ మథురలో జరిగింది. అతడి పేరు రాజాబాబు కాగా, వయసు 32 సంవత్సరాలు. సున్ రాక్ గ్రామంలో నివాసం ఉంటున్న రాజాబాబు కొంత కాలంగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. చాలా మంది డాక్టర్ల దగ్గరికి వెళ్లి చూపించుకున్నా కూడా అతడి కడుపు నొప్పి మాత్రం తగ్గలేదు. ఏ డాక్టర్ కూడా అతడికి నయం చేయలేకపోయాడు.దీంతో రాజాబాబు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తనకు తానే కడుపు కోసుకుని ఆపరేషన్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు.
సర్జరీ ఎలా చేయాలో యూట్యూబ్ లో వీడియోలు చూశాడు. మథురకు వెళ్లి ఆపరేషన్ కు అవసరమయ్యే సర్జికల్ బ్లేడ్ లు, కుట్లు వేసుకునే నీడిల్స్, మత్తు ఇంజెక్షన్లు తెచ్చుకున్నాడు. ఇక యూట్యూబ్ లో కొన్ని సర్జరీ వీడియోలు చూసి పొట్టపై 7 ఇంచుల మేర కోసి. పొట్టలో నోప్పికి గల కారణాన్ని వెతికాడు. అతడికి ఏమీ కనిపించలేదు. దాంతో 11 ఇంచులు మేర కట్ చేశాడు. నొప్పి ఇంకా ఎక్కువ కావడంతో కుటుంబ సభ్యులకు చెప్పాడు. దీంతో వాళ్లు హుటాహుటిన రాజాబాబును ఆస్పత్రికి తరలించగా, ఇతగాడు చేసిన పనిని చూసి వైద్యులు షాక్ అయ్యారు. ఇక మెరుగైన చికిత్స కోసం ఆగ్రాలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన కండీషన్ నిలకడగా ఉందన్నారు. రాజా బాబుకు దాదాపు 18 ఏళ్ల క్రితం అపెండిసైటిస్ ఆపరేషన్ జరిగింది. అయిన గత కొన్ని రోజులుగా కడుపు నొప్పి అతనిని చాలా వేధిస్తుందని రాజబాబు మేనల్లుడు తెలియజేశారు.