Shine Tom Chacko | దసరా, డాకు మాహారాజ్ సినిమాల ఫేం.. మలయాళం నటుడు షైన్ టామ్ చాకో (Shine Tom Chacko) తాజాగా పోలీసుల ముందు విచారణకు హాజరయ్యాడు. ఈ రోజు ఉదయం 10 గంటల సమయంలో షైన్ టామ్ చాకో తన న్యాయవాదితో కలిసి ఎర్నాకుళం నార్త్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఇటీవల ఒక హోటల్‌పై డ్రగ్స్ రైడ్ జరిగిన సమయంలో షైన్ టామ్ చాకో అక్కడి నుంచి పరారైనట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై పోలీసులు ఆయన్ని ప్రశ్నించనున్నారు. అలాగే, డ్రగ్స్ వినియోగం గురించి కూడా ఆయన ప్రశ్నలు ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లు సమాచారం.
అసలు ఏం జరిగిందంటే..
కొచ్చిలోని ఒక హోటల్లో డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న సమాచారంతో జిల్లా యాంటీ-నార్కోటిక్ స్పెషల్ యాక్షన్ ఫోర్స్ (DANSAF) బృందం గత బుధవారం ఉదయం 11 గంటల సమయంలో రైడ్ చేసింది. అయితే, పోలీసులు రాకముందే ఆ హోటల్లో ఉన్న నటుడు షైన్ టామ్ చాకో హోటల్ నుంచి పారిపోయాడు. మూడో అంతస్తులో ఉన్న షైన్, కిటికీ ద్వారా రెండో అంతస్తుకు దూకి, అక్కడి నుంచి మెట్ల మార్గంలో పరారైనట్లు సీసీటీవి ఫూటేజ్ ద్వారా తెలిసిందని పోలీసులు వెల్లడించారు. అయితే ఇదే రైడ్ విషయంలో షైన్ టామ్ చాకోని పోలీసులు విచారించబోతున్నట్లు తెలుస్తుంది.