చంద్రగ్రహణం
Lunar Eclipse | సెప్టెంబర్ 7న (నేడు) సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనున్నది.
ఈ సమయంలో చంద్రుడు అరుణవర్ణంలోకి మారనున్నాడు.
దేశ రాజధాని ఢిల్లీ కాలమానం ప్రకారం ఈ చంద్రగ్రహణం రాత్రి 9.58 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 1:26 గంటలకు ముగియనున్నది.
చంద్రగ్రహణం సూతకం మధ్యాహ్నం 12.57గంటలకు ప్రారంభం కానున్నది.
ఈ సూతకాలం చంద్రగ్రహణం ముగిసే వరకు ఉంటుంది.
జ్యోతిషశాస్త్ర ప్రకారం.. చంద్రగ్రహణం సూతక కాలం ఎల్లప్పుడూ 9 గంటల ముందే మొదలవనున్నది.
ఈ అరుదైన ఖగోళ సంఘటనను ప్రపంచ జనాభాలో సుమారు 85 శాతం మంది.. అంటే దాదాపు 700 కోట్లమంది వీక్షించగల అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఈ గ్రహణం మొత్తం 3 గంటల 29 నిమిషాల 24 సెకన్ల పాటు కొనసాగుతుంది.
ఇందులో సంపూర్ణ చంద్రగ్రహణం దశ 82 నిమిషాల పాటు ఉంటుంది.
గ్రహణం ప్రారంభ దశలో చంద్రుడు భూమి ఆవర్తనంలోకి ప్రవేశించగానే చీకటి కమ్ముకుంటుంది.
ఇది పాక్షిక గ్రహణాన్ని సూచిస్తుంది. అనంతరం రేలీ స్కాటరింగ్ ప్రభావంతో చంద్రుడు ఎరుపు రంగులో మెరిసిపోనున్నాడు.
భూమి, చంద్రుడు, సూర్యుడు ఒకే గీతలోకి వచ్చేటప్పుడు చంద్రుడు పూర్తిగా భూమి నీడలోకి ప్రవేశిస్తే సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది.
అదే కొంత భాగం మాత్రమే నీడలోకి వెళ్తే అది పాక్షిక చంద్రగ్రహణంగా పరిగణిస్తారు.
ఈసారి వచ్చే గ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం కావడంతో చంద్రుడు ఎరుపు రంగులో ఆకర్షణీయంగా కనిపించనున్నాడు.
అనంతరం మళ్లీ తన సహజ ప్రకాశాన్ని తిరిగి పొందుతాడు.
భూమి, చంద్రుడు, సూర్యుని కదలికల ఆధారంగా ప్రాంతాలను బట్టి గ్రహణం కనిపించే విధానం మారనున్నది.
ఈ గ్రహణం ఆసియా, తూర్పు ఆఫ్రికా, ఆస్ట్రేలియా ప్రాంతాల్లో పూర్తిగా కనిపించనుంది.
యూరప్, బ్రెజిల్ తూర్పు తీరాల్లోని ప్రజలకు ఇది పాక్షికంగా కనిపించే అవకాశం ఉంది.
మొత్తం మీద సుమారు 7 బిలియన్ మంది ఈ ఖగోళ దృశ్యాన్ని వీక్షించే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు.
చంద్రగ్రహణం