న్యూఢిల్లీ, మార్చి 6: జీఎస్టీలో ప్రస్తుతం ఉన్న నాలుగు శ్లాబుల స్థానంలో మూడింటినే కొనసాగించాలని, అతి తక్కువ శ్లాబుగా ఉన్న 5 శాతాన్ని 8కి పెంచాలని.. జీఎస్టీ హేతుబద్ధీకరణపై ఏర్పాటు చేసిన రాష్ర్టాల ఆర్థిక మంత్రుల కమిటీ తన నివేదికలో పేర్కొన్నది. 12% శ్లాబును పూర్తిగా తొలగించాలని పేర్కొన్నట్టు తెలిసింది. 2017 జూలైలో అమల్లోకి వచ్చిన జీఎస్టీ వల్ల ఆదాయం కోల్పోయే రాష్ర్టాలకు ఐదేండ్ల పాటు ఆర్థిక సాయం అందజేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. 2015-16లో రాష్ర్టాల పన్ను ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకొంటామని, దానిపై ఐదేండ్ల పాటు 14 శాతం పరిహారంగా ఇస్తామని తెలిపింది. ఐదేండ్ల గడువు జూన్‌లో ముగియనున్నది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన మొదట్లో 28% శ్లాబులో 200కు పైగావున్న వస్తువులు, ఇప్పుడు 35కు పడిపోయాయి. పరిహారం చెల్లింపును మరికొన్ని రోజులు పొడిగించాలని, జీఎస్టీ శ్లాబు రేట్లను హేతుబద్ధీకరించాలని రాష్ర్టాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కర్ణాటక సీఎం బొమ్మై నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ ఈ నెలాఖరులో నివేదికను జీఎస్టీ కౌన్సిల్‌కు సమర్పించనున్నది.
రూ.1.50 లక్షల కోట్ల అదనపు ఆదాయం
ప్రస్తుతం జీఎస్టీలో నాలుగు శ్లాబులు(5, 12, 18, 28) ఉన్నాయి. 5% శ్లాబును పూర్తిగా తొలగించి బేస్ శ్లాబును 8 శాతంగా నిర్ణయించాలని, 12 శాతం శ్లాబును ఎత్తివేయాలని కమిటీ కోరింది. దీనికి కౌన్సిల్ ఆమోదం తెలిపితే ప్రస్తుతం 12 శాతం శ్లాబులో ఉన్న వస్తువులు 18% శ్లాబులోకి వెళ్తాయి. అతి తక్కువ పన్ను శ్లాబును 8 శాతానికి పెంచడం వల్ల రూ.1.50 లక్షల కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అంచనా.