ముంబై, ఫిబ్రవరి 21 : స్టాక్ మార్కెట్ల నష్టాల పరంపర కొనసాగుతున్నది. వరుసగా నాలుగోరోజూ శుక్రవారం కూడా సూచీలు భారీగా నష్టపోయాయి. వాహన, ఫార్మా, బ్యాంకింగ్ రంగ షేర్లలో అమ్మకాలు భారీగా జరగడం, విదేశీ నిధుల తరలింపు కొనసాగుతుండటంతో మదుపరులు అమ్మకాల బటన్ నొక్కారు. ఫలితంగా వారాంతం ట్రేడింగ్‌లో ఇంట్రాడేలో 600 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 424.90 పాయింట్లు కోల్పోయి 75,311 వద్ద నిలిచింది. మరోసూచీ నిఫ్టీ 117.25 పాయింట్లు పతనం చెంది 22,795.90 వద్ద నిలిచింది. గత నాలుగు రోజుల్లో సెన్సెక్స్ 685.8 పాయింట్లు, నిఫ్టీ 163.6 పాయింట్ల చొప్పున నష్టపోయాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నిధుల తరలింపుకొనసాగుతుండటం, అమెరికా టారిఫ్ పెంపు ప్రతిపాదనలో మదుపరుల్లో ఆందోళన నెలకొన్నదని మెహతా ఈక్విటీస్ లిమిటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సీ తెలిపారు. ఐటీ, టెలికం, వాహన, రియల్టీ, ఆయిల్అండ్ గ్యాస్ రంగ షేర్లలో అత్యధికంగా అమ్మకాలు జరిగాయి.
వాహన రంగ షేర్లు కుప్పకూలాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఎలక్ట్రిక్ వాహనాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించుకునే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉండటంతో ఆటోమొబైల్ రంగ షేర్లు 6 శాతం వరకు నష్టపోయాయి. వీటిలో అత్యధికంగా మహీంద్రా అండ్ మహీంద్రా షేరు 6.07 శాతం నష్టపోయి టాప్ లూజర్‌గా నిలిచింది. దీంతోపాటు టీవీఎస్ మోటర్ 3.81 శాతం, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ 2.64 శాతం, అపోలో టైర్స్ 2.49 శాతం, టాటా మోటర్స్ 2.46 శాతం, అశోక్ లేలాండ్ 2.05 శాతం, హీరో మోటోకార్ప్ 1.45 శాతం, బజాజ్ ఆటో 1.40 శాతం, మారుతి సుజుకీ, ఎంఆర్ఎఫ్ షేర్లు కుదేలయ్యాయి. మొత్తంగా బీఎస్ఈ ఆటో ఇండెక్స్ 2.60 శాతం తగ్గి 48,135.22 వద్ద నిలిచింది. వీటితోపాటు అదానీ పోర్ట్స్, టాటా మోటర్స్, సన్‌ఫార్మా, పవర్‌గ్రిడ్, జొమాటో, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు కూడా నష్టపోయాయి. కానీ, టాటా స్టీల్, లార్సెన్ అండ్ టుబ్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో ముగిశాయి. రంగాలవారీగా చూస్తే ఆటో 2.60 శాతం, కన్జ్యూమర్ 1.49 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 1.42 శాతం, రియల్టీ 1.33 శాతం, టెలికం 1.19 శాతం చొప్పున పతనం చెందాయి. కానీ, మెటల్ రంగ షేర్లు లాభాల్లో ముగిశాయి.
ముంబై, ఫిబ్రవరి 21: మూడు వారాలుగా పెరుగుతూ వచ్చిన విదేశీ మారకం నిల్వలు మళ్లీ కరిగిపోయాయి. ఈ నెల 14తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 2.54 బిలియన్ డాలర్లు తరిగిపోయి 635.721 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్లు రిజర్వుబ్యాంక్ వెల్లడించింది.