Biological Age | న్యూఢిల్లీ: ఆత్మీయులను కోల్పోవడం అత్యంత బాధాకరం. ఆ ఆవేదన నుంచి కోలుకోవడం చాలా కాలం వరకు సాధ్యం కాదు. దీని ప్రభావం జీవించి ఉన్నవారి వృద్ధాప్యంపై కూడా పడుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన మెయిల్మన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, బట్లర్ కొలంబియా ఏజింగ్ సెంటర్ పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. తల్లిదండ్రులు, భార్య/భర్త, తోబుట్టువులు లేదా పిల్లలను కోల్పోయినవారికి, ఇలాంటి సంఘటనలు జరగనివారికి వృద్ధాప్యం ఏ విధంగా వస్తున్నదో వీరు పరిశీలించారు. ఆత్మీయులను కోల్పోయినవారికి వేగంగా వృద్ధాప్యం వస్తున్నట్లు వీరు గుర్తించారు. పరిశోధకుడు అలిసన్ అయిల్లో మాట్లాడుతూ, బాల్యం నుంచి వయోజనులయ్యే వరకు జీవితంలో ఆత్మీయులను కోల్పోవడానికి, జీవ సంబంధిత వృద్ధాప్యం వేగవంతమవడానికి మధ్య బలమైన సంబంధం ఉన్నట్లు గుర్తించామన్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ, కణజాలం, అవయవాలు పనిచేసే సామర్థ్యం తగ్గుతుందని, తీవ్ర స్థాయి వ్యాధులు వృద్ధి చెందే అవకాశాలు పెరుగుతాయని చెప్పారు.
జీవ సంబంధిత వృద్ధాప్యాన్ని ఎపిజెనెటిక్ క్లాక్స్ (డీఎన్ఏ మార్కర్లు) ఆధారంగా నిర్ణయించవచ్చునని తెలిపారు. కణజాల స్థాయిలో శరీరం ఎంత వేగంగా వృద్ధాప్యం దిశగా అడుగులు వేస్తున్నదో ఈ క్లాక్స్ చెబుతాయని వివరించారు. ఆత్మీయులను కోల్పోవడానికి, జీవితాంతం ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడానికి మధ్య సంబంధం ఉందన్నారు. నడి వయసుకు ముందే వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తాయని ఈ అధ్యయనం తెలిపింది. ఎక్కువ మంది ఆత్మీయులను కోల్పోయినవారికి వృద్ధాప్యం వేగంగా వచ్చినట్లు తెలిపింది. చిన్న వయసులోనే తల్లిదండ్రులను లేదా తోబుట్టువులను కోల్పోయినవారిపై ఆ బాధ జీవితాంతం తీవ్రంగా ఉంటుందని తెలిపింది. ఈ పరిస్థితులు మానసిక ఆరోగ్య సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులు, అకాల మరణాలకు దారి తీసే అవకాశం ఉన్నట్లు వివరించింది. ఆత్మీయులు మరణించిన తర్వాత చాలా కాలం వరకు ఆరోగ్యంపై ప్రభావం ఉంటుందని పేర్కొంది. బాల్యం, కౌమార దశల్లో ఇటువంటి సంఘటనలు జరిగితే, ఆ ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని తెలిపింది.