డోడోమా: ఆహారం కోసం జీబ్రాలను వేటాడేందుకు కాపు కాసిన ఆడ సింహాలు వాటి తొక్కిసలాటలో చిక్కుకున్నాయి. ఒక ఆడ సింహం జీబ్రాల తొక్కిసలాటలో దాదాపు చావు నుంచి బయటపడింది. చివరకు ఒక జీబ్రాను అది వేటాడింది. టాంజానియాలోని సెరెంగేటి నేషనల్ పార్క్లో ఈ సంఘటన జరిగింది. జీబ్రాల మంద రాకను చూసిన ఆడ సింహాలు వాటిని వేటాడేందుకు కాపు కాశాయి. అయితే పరుగులు తీస్తూ వచ్చిన ఆ జీబ్రాల గుంపు తొక్కిసలాటలో కొన్ని ఆడ సింహాలు చిక్కుకున్నాయి. ఒక సింహం తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి దాదాపు చావు నుంచి తప్పించుకుంది. అయితే చివరకు ఒక జీబ్రాను అది వేటాడింది.
కాగా, ‘మాసాయి సైటింగ్స్’ అనే యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇప్పటికే 64 వేలసార్లు దీనిని వీక్షించారు. ‘లైన్ కింగ్’ సినిమాను గుర్తు చేసిందని నెటిజన్లు పేర్కొన్నారు. జీబ్రాల మంద తొక్కిసలాటలో ఆడ సింహం చిక్కుకున్నప్పటికీ చివరకు ఒక దానిని అది వేటాడటాన్ని కొందరు ప్రశంసించారు.