
సిటీబ్యూరో, నవంబరు 24 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ కార్యాలయంలో బీజేపీ కార్పొరేటర్ల గూండాగిరిపై టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఫైర్ అయ్యారు. నిరసన ముసుగులో మేయర్ చాంబర్‌పై చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు. మేయర్ కుర్చీని బీజేపీ కార్పొరేటర్లు అవమానపర్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ ఇలాంటి ఘటనలు జరగలేదని.. జీహెచ్ఎంసీ చరిత్రలో ఇదో చీకటి రోజని అభివర్ణించారు. బీజేపీ దాడితో మలినమైన జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని పాలతో శుద్ధి చేశారు. జీహెచ్ఎంసీ కార్యాలయంపై దాడి చేసిన కార్పొరేటర్లపై అనర్హత వేటు వేయాలంటూమేయర్ విజయలక్ష్మి, కమిషనర్ లోకేశ్‌కుమార్‌కు వినతిపత్రాలు సమర్పించారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి బీజేపీ కార్పొరేటర్లు ఓర్వ లేకపోతున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ కార్పొరేటర్లు పద్ధతి మార్చుకోవాలంటూ హితవు పలికారు.
జీహెచ్ఎంసీపై దాడి దుర్మార్గం : మంత్రి తలసాని
జీహెచ్ఎంసీపై బీజేపీ కార్పొరేటర్లు దాడికి దిగడం దుర్మార్గమని, వాళ్లు బాధ్యత మరిచి ప్రవర్తించారని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలుంటే అధికారులు, మేయర్ దృష్టికి తీసుకొచ్చి పరిషరించుకోవాలే తప్పా ఇలా దౌర్జన్యానికి దిగడం ఏంటని ప్రశ్నించారు. బుధవారం మాసబ్‌ట్యాంక్‌లోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో మంత్రి తలసాని మాట్లాడారు. తన 30 ఏండ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ఘటన చూడలేదని అన్నారు. ఆఫీసులపై దాడులు చేస్తామంటే కుదరదని , ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. బీజేపీ కార్పొరేటర్ల దాడిని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమర్థించడం దారుణమన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే బాగుండదని హెచ్చరించారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో హైదరాబాద్‌ను అన్ని రకాలుగా అభివృద్ధి చేసినట్లు తెలిపారు. చేస్తున్న అభివృద్ధికి సహకరించాలే తప్పా.. ఆటంకంగా మారొద్దని బీజేపీ కార్పొరేటర్లకు తలసాని హితవు పలికారు.